CM Jagan: దాన్నొక చాలెంజ్ గా తీసుకుంటున్నా... మీరు సమర్థంగా ముందుకు వెళ్లండి: గడపగడపకు... కార్యక్రమంపై సీఎం జగన్ వర్క్ షాప్

  • 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో నాణ్యత ముఖ్యమన్న సీఎం  
  • రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు మనపై ఆధారపడి ఉన్నాయని వ్యాఖ్య   
  • మునుపటికన్నా మెరుగైన ఫలితాలతో మళ్లీ అధికారంలోకి రావాలన్న జగన్  
  • 175కి 175 సీట్లు గెలుస్తామని ధీమా
CM Jagan workshop on Gadapa Gadapaku Mana Prabhutvam

తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను, మంచి పనులను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలకు నిర్దేశించారు. 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంపై ఇవాళ ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు. 

మామూలుగా అధికారంలోకి రావడం కాదు... 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో నాణ్యత చాలా ముఖ్యమని ఉద్ఘాటించారు. జీవితంలో ఏ పనైనా నాణ్యతతో చేస్తేనే నిలదొక్కుకుంటామని అన్నారు. అందుకే క్వాలిటీతో కూడిన కార్యక్రమాలు చేయడం ముఖ్యమని పేర్కొన్నారు. 'గడపగడపకు...' కార్యక్రమాన్ని కూడా ఇలాగే నాణ్యతతో చేయాలని తెలిపారు. 

"రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు మనపై ఆధారపడి ఉన్నాయి. వారికి న్యాయం జరగాలంటే తిరిగి మనం అధికారంలోకి రావాల్సి ఉంది" అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. మామూలుగా అధికారంలోకి రావడం కాదు... మునుపటికన్నా మెరుగైన ఫలితాలతో అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించామని, అలాంటప్పుడు మనం అనుకున్న ఫలితాలను ఎందుకు సాధించలేమని ప్రశ్నించారు. 

ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షలు.. ఎమ్మెల్యేలకు రూ.2 కోట్ల చొప్పున కేటాయింపు 

రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు పథకాలు అందించామని, వారి మద్దతు తీసుకుంటే 175కి 175 స్థానాలు ఎందుకు గెలవలేమని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా, వివక్షకు తావులేకుండా, అవినీతి రహితంగా సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందిస్తున్నామని వెల్లడించారు. ఒక్క బటన్ క్లిక్ తో లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు పంపుతున్నామని, ప్రతి నెలా క్యాలెండర్ ఇచ్చి, పరిస్థితులతో సంబంధం లేకుండా బటన్ నొక్కి లబ్ది చేకూర్చుతున్నామని వివరించారు. 

ఒక్కో సచివాలయంలో ప్రాధాన్యతా పనుల కోసం రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు. 'గడపగడపకు...' వెళ్లినప్పుడు ప్రజల నుంచి వచ్చే వినతులను పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యతా క్రమంలో చేయాల్సిన పనుల కోసం ఈ డబ్బు వినియోగించాలని పేర్కొన్నారు. ఒక నెలలో ఎమ్మెల్యేలు పర్యటించే సచివాలయాల్లో పనులకు సంబంధించి ముందుగానే ఆయా జిల్లాల కలెక్టర్లకు డబ్బు పంపుతున్నామని చెప్పారు. ఎమ్మెల్యేలకు రూ.2 కోట్ల చొప్పున కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలపై జీవో కూడా ఇచ్చామని వెల్లడించారు.

సీఎం అభివృద్ధి నిధి నుంచి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద కేటాయింపు ఉంటుందని, సచివాలయాలకు కేటాయించే నిధులకు ఇది అదనం అని సీఎం జగన్ వివరించారు. "ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించి పనులు చేయించడాన్ని ఓ చాలెంజ్ గా తీసుకుంటున్నాను. మీరు చేయాల్సిందల్లా 'గడపగడపకు...' కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడమే" అని దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యాచరణలో భాగంగా ప్రతి ఎమ్మెల్యే రానున్న నెలరోజుల్లో 7 సచివాలయాలను సందర్శించాలని స్పష్టం చేశారు. కనీసం 16 రోజులు, గరిష్ఠంగా 21 రోజులు 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రతి ఒక్కరూ కమిట్ మెంట్ తో ముందుకు వెళ్లాలని ఉద్బోధించారు.

More Telugu News