Eknath Shinde: ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంపై క్విడ్‌ప్రోకో ఆరోపణలు

  • శివసేన రెబెల్ అబ్దుల్ సత్తార్ కు షిండే ప్రభుత్వం గిఫ్ట్
  • అబ్దుల్ స్పిన్నింగ్ మిల్లుకు రూ. 15.17 కోట్ల నిధుల విడుదల
  • ప్రభుత్వ సహకారంతో ఇటీవలే మిల్లును స్థాపించామన్న అబ్దుల్ 
Quid Pro Quo allegations on Eknath Shende government

బీజేపీ అండతో మహారాష్ట్రలో శివసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసి... ఆ పార్టీ రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. మరోవైపు అధికారాన్ని చేపట్టిన రోజుల వ్యవధిలోనే ఏక్ నాథ్ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోంది. శివసేన రెబెల్ ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ కుటుంబానికి చెందిన స్పిన్నింగ్ మిల్లుకు రూ. 15.17 కోట్ల నిధులను విడుదల చేసింది. రూ. 80 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించి స్టేట్ క్యాపిటల్ గా ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఈ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదమయింది. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూల్చి, ఏక్ నాథ్ సీఎంగా కావడానికి సహకరించినందుకే... అబ్దుల్ సత్తార్ కు ప్రభుత్వం గిఫ్ట్ ఇచ్చిందని పలువురు విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. శివసేన రెబెల్ వర్గంలో ప్రభుత్వం నుంచి బహుమతిని అందుకున్న తొలి నేత అబ్దుల్ అని అంటున్నారు. ఇది ముమ్మాటికీ క్విడ్ ప్రోకోనే అని దుయ్యబడుతున్నారు. 

మరోవైపు దీనిపై అబ్దుల్ సత్తార్ స్పందిస్తూ... ఇటీవలే ఈ స్పిన్నింగ్ మిల్ ను ప్రభుత్వ సహకారంతో స్థాపించామని చెప్పారు. ఈ మిల్లు వల్ల ఎందరికో జీవనోపాధి లభిస్తుందని తెలిపారు. తన కుమారుడు మిల్లు నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్నారని చెప్పారు.

More Telugu News