Teeth: నానో రోబోలు.. పళ్లు తోముతాయి, బ్యాక్టీరియానూ చంపేస్తాయి!

  • బ్రషింగ్ కు తోడ్పడే సరికొత్త టెక్నాలజీని రూపొందించిన పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
  • దంతాల ఆకృతికి అనుగుణంగా ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ శుభ్రం చేసే రోబోలు
  • ఐరన్ ఆక్సైడ్ రోబోలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ తో ఫ్రీరాడికల్స్ ఉత్పత్తి
  •  తద్వారా బ్యాక్టీరియా నిర్మూలన అవుతుందని పరిశోధకుల వెల్లడి
Swarm of shapeshifting microrobots brush rinse floss your teeth

కొందరికి అర్ధరాత్రి దాకా ఫోన్ చూడటం.. పొద్దున్నే లేవడానికి ఇబ్బంది పడటం అలవాటు. ఇక పళ్లు తోముకోవడాకైతే మహా బద్ధకం. ఏదో పైపైన బ్రష్ చేసేసి అయిపోయిందిలే అనిపిస్తుంటారు కూడా.. అలాంటి వారి కోసం పెన్సిల్వేనియా యూనివర్సిటీ పరిశోధకులు సరికొత్తగా సూక్ష్మస్థాయి ‘షేప్ షిఫ్టింగ్ రోబో’లను అభివృద్ధి చేశారు. అతి చిన్నగా ఉండే ఈ రోబోలు ఒకదానికొకటి అతుక్కుంటూ.. అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలో పళ్లను శుభ్రం చేయడంతోపాటు మధ్యలో ఇరుక్కున్న ఆహార పదార్థాలను శుభ్రం చేయడం, సూక్ష్మజీవులను నిర్మూలించడం వంటి పనులు చేస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

పళ్లు సరిగా శుభ్రం చేసుకోకుంటే ఎన్నో సమస్యలు
ఉదయం నిద్ర లేవగానే చేసే పని పళ్లు తోముకోవడం. ఈ పని సరిగా చేయకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇందుకోసం సరిగా బ్రషింగ్ చేయడం అవసరం. చాలా మందిలో పళ్లు వివిధ ఆకృతుల్లో అమరి ఉంటాయి. అందువల్ల చాలా వరకు టూత్ బ్రష్ లు మన పళ్లను పూర్తిగా శుభ్రం చేయలేవు. ఈ పనిని సులభతరం చేసేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే పెన్సిల్వేనియా పరిశోధకులు సూక్ష్మస్థాయి ఐరన్‌ ఆక్సైడ్‌ కణాలతో ఆకారాన్ని మార్చుకునే రోబోలను తయారు చేశారు. వాటిని ఆయస్కాంతాల సాయంతో నియంత్రిస్తారు. 

ఎలా పనిచేస్తాయి?
ఒకదానికి మరొకటి అతుక్కునే ఐరన్ ఆక్సైడ్ నానో కణాలు.. మన దంతాల ఆకృతి, మధ్యలో ఉండే సందులకు అనుగుణంగా తమ ఆకారాన్ని మార్చుకుంటాయి. అతి సన్నని బ్రెసిల్స్ (బ్రష్ లోని పోగులు)గా కూడా మారి పళ్ల సందుల్లోకి వెళ్లి శుభ్రం చేస్తాయి. వేర్వేరు ఆకృతుల్లోకి మారిపోతూ పళ్లకు పట్టిన గారను కూడా శుభ్రం చేస్తాయి.
ఇక ఐరన్‌ ఆక్సైడ్‌ శరీరంలో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ను ప్రేరేపిస్తుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనితో ఫ్రీరాడికల్స్ ఉత్పత్తి అవుతాయని తేల్చారు. ఫ్రీరాడికల్స్‌ కు బ్యాక్టీరియాను చంపేసే శక్తి ఉంటుంది. అంటే ఈ సూక్ష్మ రోబోల వల్ల పళ్లు శుభ్రపడటంతోపాటు నోటిలోని బ్యాక్టీరియా కూడా నిర్మూలం అవుతుంది.

  • ఈ సూక్ష్మ రోబోలు, వాటిని నియంత్రించే వ్యవస్థను నోటిలో పెట్టుకుంటే చాలు.. ఆటోమేటిగ్గా పళ్లను శుభ్రం చేసేస్తాయని పరిశోధనకు నేతృత్వం వహించిన పెన్సిల్వేనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డెంటల్ విభాగం ప్రొఫెసర్, శాస్త్రవేత్త హ్యున్ కూ తెలిపారు.
  • కాగా తమ ప్రయోగాలు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నాయని.. వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు మరికొంత సమయం పడుతుందని హ్యున్ కూ వెల్లడించారు. ఈ పరిశోధన వివరాలు ఏసీఎస్‌ నానో జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

More Telugu News