Team India: లండన్​ విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకున్న భారత మాజీ పేసర్​

  • ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ లో పీజీ పూర్తి చేసిన వెంకటేశ్ ప్రసాద్
  • క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత చదువుపై దృష్టి పెట్టిన బౌలర్
  • నేర్చుకోవడం ఎప్పుడూ ఆపోద్దని సూచన
Former indian pacer Venkatesh Prasad Graduates from university of London

ఆటలను కెరీర్ గా ఎంచుకునే వాళ్లు చదువును పెద్దగా పట్టించుకోరు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి మేటి క్రికెటర్లు కనీసం డిగ్రీ కూడా చదవలేదు. కానీ, ఆటలో అత్యుత్తమ శిఖరాలు అందుకున్నారు. అయితే, తన ఆటతో ఎంతోపేరు తెచ్చుకున్న తర్వాత లేటు వయసులో చదువుపై దృష్టి పెట్టాడు ఓ క్రీడాకారుడు. రిటైర్మెంట్ తర్వాత ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకున్నాడు. అతను మరెవరో కాదు.. తన పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన భారత మాజీ బౌలర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌!

దాదాపు రెండు దశబ్దాల పాటు క్రికెట్ ఆడి, భారత జట్టుకు సేవ చేసిన ప్రసాద్ ఆటకు వీడ్కోలు ప్రకటించిన తర్వాత చదువుల బాట పట్టాడు. యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌లో అతను పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. ఇంటర్నేషనల్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌లో వెంకటేశ్ ప్రసాద్ శుక్రవారం పీజీ పట్టా అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. 

‘నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దు. ఎందుకంటే జీవితం ఎప్పుడూ పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ నుంచి  ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో పీజీ పట్టా అందుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. స్పోర్ట్స్‌ ఫీల్డ్‌లో మరింత సేవ చేయడానికి ఎదురుచూస్తున్నా’ అని భారత మాజీ బౌలర్ తెలిపాడు.

More Telugu News