BJP: ఇది పిరికిపంద చర్య.. ప్రశ్నిస్తున్నందుకు తెగబడుతున్నారు: ఎంపీ అర్వింద్ పై దాడి పట్ల బండి సంజయ్ ఫైర్

  • జగిత్యాల జిల్లాలో అర్వింద్ ను అడ్డుకుని, దాడి 
  • కారు అద్దాలు ధ్వంసం.. చెదరగొట్టిన పోలీసులు
  • భయపడబోమన్న అర్వింద్, బండి సంజయ్
Attack on MP Arvind This is a cowardly act of TRS says Sanjay Fire

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో వరద ముంపు బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పై దాడి యత్నం జరిగిన సంగతి విదితమే. ఈ సందర్భంగా ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.

నిలదీస్తే జీర్ణించుకోలేకనే..
టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ల నియంతృత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకే బీజేపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని సంజయ్ మండిపడ్డారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని.. ఇది ముమ్మాటికీ పిరికి పందల చర్యేనని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యవాదులంతా టీఆర్ఎస్ దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు అసహ్యించుకుంటున్నా.. వారిలో మార్పు రాకపోవడం దారుణమని పేర్కొన్నారు. తాము ఇంకా నిలదీస్తూనే ఉంటామని, పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని.. భయపడే ప్రసక్తే లేదని సంజయ్ స్పష్టం చేశారు.

ముంపు బాధితుల భూములను లాక్కున్నారు: అర్వింద్
ఎర్దండి గ్రామంలో ముంపునకు గురైన వారిని పరామర్శించేందుకు వెళ్తుంటే టీఆర్ఎస్ కార్యకర్తలు తనను అడ్డుకోవడంపై అర్వింద్ మండిపడ్డారు. ఇక్కడి గోదావరి ముంపు బాధితులకు ప్రభుత్వం గతంలో పట్టాలిచ్చిందని.. కానీ ఆ భూములను స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తమ బంధువులకు ఇప్పించుకున్నారని అర్వింద్ ఆరోపించారు. ఈ తప్పును ఎత్తిచూపుతానన్న భయంతోనే తనపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

More Telugu News