Ram: మూవీ రివ్యూ: 'ది వారియర్'

  • ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'ది వారియర్'
  • కథలో ఒక కొత్త పాయింటును టచ్ చేసిన లింగుసామి
  • పోలీస్ పాత్రలో మెప్పించిన రామ్
  • విలన్ పాత్రలో జీవించిన ఆది పినిశెట్టి  
  • బరువు తగ్గవలసి ఉన్న కృతి శెట్టి
  • కనిపించని భయంకరమైన ట్విస్టులు 
  • బోర్ కొట్టకుండా కథను నడిపించిన లింగుసామి  
The Warrior Movie Review

ప్రతి హీరో కూడా తన కెరియర్లో ఒక్కసారైనా పోలీస్ ఆఫీసర్ పాత్రను చేయాలనుకుంటాడు. అందుకు కారణం ఆ పాత్రలో కావలసినంత మాస్ యాక్షన్ ను పండించవచ్చు. అలాంటి ఒక పవర్ఫుల్ పాత్రకి ఎమోషన్ అనే లైన్ టచ్ అయితే ఆ యాక్షన్ వీలైననని విజిల్స్ ను వసూలు చేస్తుంది. అలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ చేసిన సినిమానే 'ది వారియర్'.

శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో రామ్ సరసన నాయికగా కృతిశెట్టి నటించగా, ప్రతినాయకుడి పాత్రలో ఆది పినిశెట్టి కనిపిస్తాడు. తాను పోలీస్ కథ చేస్తే అందులో ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటేనే చేయాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తూ వచ్చినట్టుగా రామ్ చెప్పాడు. మరి ఈ సినిమాలో ఉన్న ఆ కొత్త పాయింట్ ఏమిటనేది చూద్దాం.

సత్య (రామ్) ఓ డాక్టర్ ..  కర్నూల్ లోని ఒక హాస్పిటల్లో పనిచేయడానికి తన తల్లి రాజకుమారి (నదియా)ని వెంటబెట్టుకుని హైదరాబాదు నుంచి వెళతాడు. వాళ్ల పక్కింట్లోనే తన తండ్రి మాధవ్ (పోసాని)తో కలిసి మహాలక్ష్మి (కృతి శెట్టి) ఉంటుంది. రేడియో జాకీగా పనిచేస్తున్న ఆమెకి 'విజిల్' మహాలక్ష్మిగా పేరు. పెద్దగా టైమ్ తీసుకోకుండానే ఇద్దరూ లవ్ లో పడతారు. ఇక ఆ ఊర్లో 'గురు' (ఆది పినిశెట్టి) చెప్పిందే న్యాయం .. చేసిందే శాసనం అన్నట్టుగా ఉంటుంది. 

తనని ఎదిరించిన వారిని చంపేసి .. ఆ పై ఒక మొక్క నాటడం అతనికి అలవాటు. అది ఇప్పుడు పెద్ద వనంగా మారిందంటే  గురు విలనిజం ఏ రేంజ్ లో ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. అనేక అక్రమ వ్యాపారాలు ఆయన కనుసన్నలలో జరుగుతూ ఉంటాయి. అయితే అతని అవినీతి పసిపిల్లల ప్రాణాల మీదికి రావడంతో, గురుపై సత్య ఫిర్యాదు చేసి అతనికి పగ అవుతాడు. దాంతో సత్యని చితగ్గొట్టేసిన గురు, అతనిని కొండారెడ్డి బురుజుకు వ్రేల్లాడదీస్తాడు. అలాంటి పరిస్థితుల్లో సత్యని తీసుకుని తల్లి అక్కడి నుంచి బయటపడుతుంది.

కర్నూల్లో 'గురు'కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవారు లేరు. చెప్పినా పోలీసులు తీసుకోరు. అందువలన తానే అక్కడికి పోలీస్ ఆఫీసర్ గా వెళ్లాలనే పట్టుదలతో ఐపీఎస్ ను సాధించి ఫస్టు పోస్టింగును కర్నూల్ లో వేయించుకుని సత్య అక్కడికి వస్తాడు. ఈ రెండేళ్లలో తొండముదిరి ఊసరవెల్లి అయినట్టుగా రౌడీయిజంలో నుంచి రాజకీయాల్లోకి రావడానికి గురు ట్రై చేస్తుంటాడు. డాక్టర్ గా వెళ్లిన సత్య పోలీస్ ఆఫీసర్ గా వచ్చినట్టు గా 'గురు'కి తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? 'గురు'ను సత్య ఎలా ఎదుర్కొంటాడు? అనేదే కథ.

హీరో ఇంటర్వెల్ వరకూ డాక్టర్ గా కనిపించి .. ఆ తరువాత నుంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడమే ఈ కథలోని కొత్త పాయింట్. ఈ రెండు పార్టులు .. ఈ రెండు పాత్రలు సిల్లీగా .. ఫన్నీగా మాత్రం అనిపించవు. అతికించినట్టుగా కూడా అనిపించవు. రెండు పాత్రలను లింగుసామి డిజైన్ చేసిన తీరు .. ఆ రెండు పాత్రల వెంట కథను పరిగెత్తించిన విధానం ఆసక్తికరంగా అనిపిస్తాయి. తక్కువ పాత్రలతో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా దర్శకుడు లింగుసామి కథను చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ఇటు హీరో పాత్రను .. అటు విలన్ పాత్రను బ్యాలెన్స్ చేసిన పద్ధతి ఆశ్చర్యపరుస్తుంది.  

డాక్టర్ గా సత్య నిండుచూలాలైన తన అక్కను తీసుకుని కార్లో వెళుతుండగా విలన్ గ్యాంగ్ లారీల్లో ఛేజ్ చేయడం .. పోలీస్ ఆఫీసర్ గా రైల్వేస్టేషన్లో ఎంట్రీ .. అక్కడి ఫైట్ సీన్ ను చిత్రీకరించిన తీరు హైలైట్ గా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే తో లింగుసామి అద్భుతాలు చేయకపోయినా, మొదటి నుంచి చివరివరకూ బోర్ కొట్టకుండా కథను ఆసక్తికరంగా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే రొమాంటిక్ పాళ్లు మరికాస్త పెంచితే బాగుండునే అనే ఒక మాట మాస్ ఆడియన్స్ నుంచి వినిపించే అవకాశం ఉంది. 

రామ్ - కృతి శెట్టి జంట బాగుంది. అందంగా కనిపించడంలో ఇద్దరూ పోటీపడ్డారనే చెప్పాలి. యాక్షన్ తో రామ్ .. గ్లామర్ పరంగా కృతి శెట్టి మంచి మార్కులు కొట్టేస్తారు. ఇక నదియా పాత్రలో అదే హుందాతనం కనిపిస్తుంది. విలన్ గా ఆది పినిశెట్టి నటనకి వంక బెట్టవలసిన అవసరమే లేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. 'తడబడమని' .. 'బుల్లెట్' .. 'విజిల్' సాంగ్స్ చాలా బాగున్నాయి.  పాటల చిత్రీకరణ .. కొరియోగ్రఫీ మరింత అందాన్ని తీసుకుని వచ్చాయి. 

 ఈ సినిమాకి బుర్రా సాయిమాధవ్ సంభాషణలు సమకూర్చాడు. 'మనిషన్నోడు బలంతో బతకాలా .. లేదంటే భయంతో బతకాలా' .. 'రౌడీయిజం చేసేవాడు రాజకీయాల్లోకి వచ్చాడంటే ఓకే . కానీ ఒక డాక్టర్ .. పోలీస్ ఆఫీసర్  కావడమేంట్రా?' .. 'నెత్తిన సింహాలను పెట్టుకుని కుక్కలా బ్రతడానికి సిగ్గుపడాలి' .. 'వీలైతే మారిపోండి .. లేదంటే పారిపోండి' .. 'చొక్కా మార్చినంత తేలిగ్గా చట్టాన్ని మార్చలేవు' .. 'ధైర్యమంటే .. వెతుక్కుంటూ వచ్చినవాడిని కొట్టడం కాదు .. వెతుక్కుంటూ వెళ్లి కొట్టడం' వంటి డైలాగ్స్ భలే ఉన్నాయే అనిపిస్తుంది. 

సుజీత్ వాసుదేవ్ కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ అనే చెప్పాలి. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా నీట్ గా ఉంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా  రామ్ ను చూపించడంలో లింగుసామి ..  అలా కనిపించడంలో రామ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక కృతి శెట్టి కాస్త బరువు తగ్గవలసిన అవసరం ఉందనిపిస్తుంది. కామెడీ .. రొమాన్స్  .. భయంకరమైన ట్విస్టులు లేకపోయినా, బోర్ అనిపించకుండా కథ నడుస్తుంది .. రామ్ అభిమానులకు ఇంకాస్త ఎక్కువగా నచ్చుతుంది .. అంతే!

--- పెద్దింటి గోపీకృష్ణ

More Telugu News