Asaduddin Owaisi: చైనా చేసిన తప్పును మనం చేయవద్దు..: ఓవైసీ

  • ఇద్దరే సంతానం చట్టానికి మద్దతు ఇవ్వమని ప్రకటన
  • దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతుందన్న ఎంఐఎం అధినేత
  • ఇది దేశానికి మంచిది కాదని వ్యాఖ్య
Owaisi says he will never support any law mandating only 2 children

ఇద్దరు పిల్లలకు మించి ఉండరాదని నియంత్రించే ఏ చట్టాన్నయినా తాను సమర్థించనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టంచేశారు. ‘‘చైనా చేసిన తప్పిదాన్ని మనం పునరావృతం చేయకూడదు. ఇద్దరు పిల్లలకు మించి కలిగి ఉండరాదన్న చట్టానికి నేను మద్దతు పలకను. ఎందుకంటే అది దేశానికి మంచిది కాదు’’ అని ఓవైసీ గురువారం ఓ వార్తా సంస్థతో తన అభిప్రాయాలను తెలియజేశారు.

‘‘దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. 2030 నాటికి ఇది స్థిరపడుతుంది. కనుక చైనా చేసిన తప్పును ఇక్కడ మనం కూడా చేయరాదు’’ అని పేర్కొన్నారు. ఒక మతంలో జనాభా పెరగడం, ఒక మతంలో తగ్గడం అన్నది జరగరాదంటూ ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించడం తెలిసిందే. జనాభా అసమతుల్యతను ఆయన ప్రస్తావించారు. 

దీనికి కౌంటర్ గా, దేశంలో ముస్లింలే ఎక్కువగా సంతాన నిరోధక సాధనాలను వాడుతున్నట్టు ఓవైసీ సైతం ఇటీవలే పేర్కొనడం గమనార్హం. జనాభా విషయంలో ముస్లింలనే ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారంటూ ఆయన లోగడ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ‘‘ముస్లింలు భారతీయులు కారా? వాస్తవాన్ని చూస్తే గిరిజనులు, ద్రవిడులే ఇక్కడి వారు’’ అని కూడా ఓవైసీ అన్నారు.

More Telugu News