Telangana: వాహనదారులకు భారీ ఊరటనిచ్చిన తెలంగాణ ప్రభుత్వం

  • ఫిట్ నెస్ గడువు తీరిన రవాణా వాహనాలపై రోజుకు రూ. 50  పెనాల్టీ
  • రెండు, మూడేళ్ల నుంచి ఫిట్ నెస్ లేని వాహనాలకు వేలల్లో రసుము
  • అంత మొత్తం కట్టలేక వాహనదారుల ఇబ్బందులు
  • రోజుకు రూ. 50 పెనాల్టీని ఉపసంహరించిన ప్రభుత్వం
Telangana govt orders vehicle fitness renewal late fee penalty exemption

తెలంగాణలో కమర్షియల్  వాహనదారులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. రవాణా వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ గడువు తీరిపోతే పునరుద్ధరించుకునే వరకు రోజుకు రూ. 50 చొప్పున పెనాల్టీ వసూలు చేయాలన్న నిబంధనను ఉపసంహరించుకుంది. దీనివల్ల దాదాపు మూడు లక్షల వాహన యజమానులకు ఉపశమనం కలగనుంది. 

కొంత మంది వాహనదారులు ఫిట్ నెస్ ను పునరుద్ధరించుకోవడం లేదు. కొన్ని సంవత్సరాల నుంచి గడువు తీరిన ఫిట్‌నెస్‌ వాహనాలనే  వినియోగిస్తున్నారు. అలాంటివారిపై రవాణా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దాంతో, వాహనదారులు ఫిట్‌నెస్‌ రెన్యువల్ కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వస్తున్నారు. కానీ, రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు.. గడువు తీరిన సమయం నుంచి రోజుకు రూ. 50 జరిమానా విధిస్తే ఆలస్య రుసుము వేలకు చేరుకుంటోంది. రెండు, మూడేళ్లుగా ఫిట్‌నెస్‌ లేని వాహనాలకు రూ. 30  వేల నుంచి 70 వేల దాకా, ఇంకా కొన్నింటికి రూ. లక్షకు పైగా పెనాల్టీ చూపిస్తోంది.

అంత భారీ మొత్తంలో జరిమానా కట్టలేని వారు తమ వాహనాలను ఇండ్లకే పరిమితం చేస్తుండగా.. మరికొందరు ఫిట్‌నెస్‌ లేకుండానే తిప్పుతున్నారు. అపరాధ రుసుము తొలగించాలన్న వాహనదారుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఫిట్‌నెస్‌ గడువు తీరిన వాహనాలపై పెనాల్టీ లేకుండా మినహాయింపు నిచ్చింది. 

అయితే, ఇప్పటికే కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున, 2020 ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌ 2021 వరకు పెనాల్టీ నుంచి మినహాయింపు వెసులుబాటును కేంద్రం కల్పించింది. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం, రోజుకు రూ.50 పెనాల్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిట్‌నెస్‌ గడువు తీరిన వాహనాలకు రోజుకు రూ. 50 పెనాల్టీ విధిస్తే ఆర్టీఏకు రూ. 650 కోట్ల దాకా ఆదాయం సమకూరేదట.  

More Telugu News