Marriages: సంపన్న మహిళలే లక్ష్యంగా.. నకిలీ విడాకుల పత్రాలతో ఏడు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికొడుకు!

  • అందరినీ ఒకేలా మోసం చేసిన నిందితుడు
  • పెళ్లి తర్వాత అందినంత దండుకోవడం అలవాటు 
  • అతడి చేతిలో మోసపోయిన ఇద్దరు మహిళలు మాట్లాడుకోవడంతో అసలు నిజాలు వెలుగులోకి
  • గతేడాది ఏప్రిల్ నుంచి పరారీలో నిందితుడు
Man who marries 7 women is now on run

ఒకరికి తెలియకుండా మరొకరిని.. మొత్తంగా ఏడుగురిని పెళ్లాడిన నిత్య పెళ్లికొడుకుపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. విడాకులు తీసుకుని రెండో పెళ్లి కోసం ఎదురుచూస్తున్న సంపన్న మహిళలే లక్ష్యంగా నకిలీ విడాకుల పత్రంతో మోసాలకు పాల్పడ్డాడు. అంతేకాదు, ఒకే కాలనీలో ముగ్గురు భార్యలు ఉండడం గమనార్హం. అతడి బారినపడి మోసపోయిన ఇద్దరు మహిళలు నిన్న హైదరాబాదు, సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో వివరాలు వెల్లడించారు. 

ఆ వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడికి చెందిన అడపా శివశంకర్ బాబు ఇంజినీరింగ్ చదువుకున్నాడు. రెండో వివాహం కోసం మ్యాట్రిమోని సైట్లలో నమోదు చేసుకున్నాడు. తనకు వివాహమై విడాకులు తీసుకున్నానని, ఒక కుమార్తె కూడా ఉందని చెప్పేవాడు. తనను సంప్రదించిన వారికి విడాకుల ధ్రువీకరణ పత్రం కూడా చూపించేవాడు. ఓ ఐటీ కంపెనీలో నెలకు రూ. 2 లక్షల వేతనంతో పనిచేస్తున్నట్టు పే స్లిప్ కూడా చూపించేవాడు. అలా మోసం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత పలు కారణాలతో అత్తింటి నుంచి డబ్బులు దండుకునేవాడు. అమెరికా వెళ్తున్నట్టు నటించి డబ్బులు గుంజేవాడు. ఆ తర్వాత వాయిదా పడిందని చెప్పేవాడు. అనుమానంతో గట్టిగా అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేసుకోమనేవాడు. 

ఈ క్రమంలో బాధిత మహిళ ఒకరు మెదక్ జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌‌ను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడిని పిలిపించడంతో మరో మహిళతో వచ్చాడు. ఆమే తన భార్య అని చెప్పాడు. భార్యకు విడాకులు ఇచ్చానన్న నిందితుడు మరో మహిళతో పోలీస్ స్టేషన్‌కు రావడంతో వారిలో అనుమానం మొదలైంది. ఆ తర్వాత మహిళలు ఇద్దరూ మాట్లాడుకోవడంతో వారిద్దరూ ఒకేలా అతడి చేతిలో మోసపోయినట్టు గుర్తించారు. దీంతో రెండో  మహిళ తన సోదరులకు చెప్పి అతడిపై నిఘా పెట్టగా ఒకే కాలనీలోని మూడు వీధుల్లో ముగ్గురు మహిళలతో అతడు జీవిస్తున్న విషయం బయటపడింది. నిలదీయడంతో ఆ తర్వాత కనిపించడం మానేశాడు.

అతడికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆరా తీయగా మొత్తంగా తమతో కలిసి ఏడుగురు అతడి చేతిలో మోసపోయినట్టు తెలుసుకుని షాకయ్యారు. అతడి మోసాలపై 2019లో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఒకరు, 2021లో మరొకరు, అలాగే ఆర్సీపురం, గచ్చిబౌలి, అనంతపురం, ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషనల్లో వేర్వేరు మహిళలు అతడిపై ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. గతేడాది ఏప్రిల్‌లో మరో అమ్మాయిని పెళ్లాడాడని, అప్పటి నుంచి పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

More Telugu News