Kotamreddy Sridhar Reddy: గుండెకు రంధ్రంతో బాధపడుతున్న చిన్నారి... ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆసరా

  • గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన కోటంరెడ్డి
  • ఉప్పుటూరులో ఓ చిన్నారి దీనస్థితికి చలించిపోయిన వైనం
  • తిరుపతిలో బాలికకు శస్త్రచికిత్స.. విజయవంతం
  • ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు
MLA Kotamreddy helps a girl who needed a heart surgery

నెల్లూరు రూరల్ పరిధిలోని ఉప్పుటూరు గ్రామానికి చెందిన పొట్లూరు స్నేహ అనే గిరిజన బాలిక గుండెలో రంధ్రంతో బాధపడుతోంది. ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించగా, ఈ చిన్నారి అనారోగ్యం విషయం ఆయన దృష్టికి వచ్చింది. స్నేహ తల్లిదండ్రులు పేదవాళ్లని స్థానిక నేతలు ఎమ్మెల్యేకి వివరించారు. బాలిక తల్లిదండ్రులు కూడా తమ దీనస్థితిని కోటంరెడ్డికి విన్నవించుకున్నారు. దాంతో ఆయన చలించిపోయారు. 

తిరుపతిలోని పెద్దాసుపత్రిలో ఆ బాలిక చికిత్సకు ఏర్పాట్లు చేయించారు. ఓ కారు ఏర్పాటు చేసి, తన ప్రతినిధిని కూడా బాలికతో పాటు తిరుపతి పంపించారు. అక్కడి డాక్టర్లతో మాట్లాడారు. కాగా, ఆ బాలిక గుండెకు వైద్యులు ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స చేయగా, విజయవంతమైంది. ఈ విషయం తెలిసి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవలే బాలిక డిశ్చార్జి అయింది. ఆ చిన్నారితో కలిసి తల్లిదండ్రులు కోటంరెడ్డి ఆఫీసుకు వచ్చి కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News