Arvind Kejriwal: ఆశ్చర్యం.. ‘సామాన్య ముఖ్యమంత్రి’ కేజ్రీవాల్​ కార్ల కోసం రూ. 1.44 కోట్ల ఖర్చు!

  • ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కార్ల కోసం రూ. 45 లక్షలు ఖర్చు చేసిన ప్రభుత్వం
  • ఆర్టీఐ  దరఖాస్తు ద్వారా వెల్లడి
  • గతంలో ప్రభుత్వ కారు, బంగ్లా వద్దన్న కేజ్రీవాల్
  • ఈ ఏడాది నాలుగు ఖరీదైన కార్లు వాడిన ఢిల్లీ ముఖ్యమంత్రి
Delhi govt has spent Rs 1 crore 44 lacs on CM Kejriwals cars reveals RTI reply

దేశంలో సరికొత్త రాజకీయ ఒరవడి సృష్టించిన నాయకుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. నిరాడంబర జీవితానికి, సున్నిత మనస్తత్వానికి ఆయన చిరునామా. సామాన్యుల్లో ఒకడిగా ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ స్థాపించిన కేజ్రీవాల్ 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా సింపుల్ గా, పాత వ్యాగన్ ఆర్ కారులో తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన సాదాసీదాగా ఉండేందుకే ప్రయత్నించారని చెప్పొచ్చు.
 
కానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోసం వాహనాలు కొనుగోలు చేసేందుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి రూ.1.44 కోట్లు ఖర్చు చేసిందని తేలడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కార్ల కోసం దాదాపు 45 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విషయాలు సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడయ్యాయి. 

కేజ్రీవాల్ ఈ ఏప్రిల్ లో రూ. 36 లక్షల ఖరీదు గల ఎంజీ గ్లోస్టర్‌ కారులో కనిపించారు. అంతకు ముందు రెండు  టొయోటా ఇన్నోవా వాహనాలు వాడారు. అలాగే, మద్రా ఆల్టురాస్ జీ4లో కనిపించారు. దీని ధర కూడా రూ. 32 లక్షల కంటే ఎక్కువ. వీటన్నింటికి కలిపి ఢిల్లీ సర్కారు కోటిన్నర వరకు ఖర్చు చేసినట్టు తెలిసింది.  2015 ఎన్నికలకు ముందు, కేజ్రీవాల్ తాను ‘విఐపి సంస్కృతి’ని నిషేధిస్తానని ప్రకటించారు. అదే సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 49 రోజుల తర్వాత  ‘విఐపి సంస్కృతి’కి స్వస్తి పలికినట్లు పేర్కొన్నారు. ఆ ఏడాది అధికారిక కారు తీసుకోవడానికి కేజ్రీవాల్ నిరాకరించారు.

రాంలీలా మైదాన్‌లో తన ప్రమాణ స్వీకారోత్సవానికి మెట్రోలో ప్రయాణించి అందరిచేతా ‘సామన్య ముఖ్యమంత్రి’ అనిపించుకున్నారు. అలాగే, ఢిల్లీలో ముఖ్యమంత్రుల కోసం కేటాయించే విలాసవంతమైన బంగ్లాలోకి మారడానికి కూడా నిరాకరించారు. చాన్నాళ్ల పాటు వ్యాగన్ ఆర్ కారులోనే ప్రయణించారు. దీన్ని కూడా విదేశాల్లో నివసిస్తున్న ఓ అభిమాని ఆయనకు బహుమతిగా ఇచ్చారు. అలాంటి వ్యక్తి వాహనాల కోసం ఢిల్లీ ప్రభుత్వం రూ. 1.44 కోట్లు ఖర్చు చేసిందంటే ఆశ్చర్యం అనిపిస్తోంది. దీనిపై కాంగ్రెస్ తో పాటు విపక్ష పార్టీలు కేజ్రీవాల్ పై విమర్శల దాడి మొదలు పెట్టాయి.

More Telugu News