Protesters: గొటబాయ రాజపక్స నివాసంలోకి చొరబడి స్విమ్మింగ్ పూల్ లో ఈతకొట్టిన నిరసనకారులు... వీడియో ఇదిగో!

  • శ్రీలంకలో తీవ్రస్థాయిలో సంక్షోభం
  • గొటబాయ రాజపక్స నివాసం ముట్టడి
  • అంతకుముందే పారిపోయిన రాజపక్స
  • ఎంపీ రజిత సేనారత్నేపై నిరసనకారుల దాడి
Protesters entered into Gotabaya Rajapaksa residence and swims in the pool

శ్రీలంకలో సంక్షోభం తారస్థాయికి చేరింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోగా, పరిస్థితి మరింత దిగజారింది. కొన్నిరోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆందోళనకారులు ఇవాళ తీవ్రస్థాయిలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసాన్ని ముట్టడించారు. ఆయన అంతకుముందే తన ఇంటినుంచి పారిపోగా, ఆందోళనకారులు ఆయన నివాసంలోకి చొరబడ్డారు. 

ఇంటి లోపలి భాగంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో కొందరు నిరసనకారులు ఈతకొట్టారు. మరికొందరు ఇంట్లోని గదుల్లో ఉన్న ఫర్నిచర్ పై ఆసీనులయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. 

కాగా, దేశంలో పరిస్థితి అదుపుతప్పుతుండడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు రణిల్ విక్రమసింఘే సంసిద్ధులయ్యారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. శ్రీలంకలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు రణిల్ విక్రమసింఘే మార్గం సుగమం చేస్తున్నారని పేర్కొంది.

అటు, వీధుల్లోకి వచ్చిన లంక ప్రజలు ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఎస్జేబీ ఎంపీ రజిత సేనారత్నేపై ఆందోళనకారులు దాడికి పాల్పడారు. సంక్షోభం మరింత ముదిరిన నేపథ్యంలో శ్రీలంకలో జులై 15 వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

More Telugu News