China: భారత్ సరిహద్దుల్లోకి దూసుకొచ్చిన చైనా విమానం... అప్రమత్తమైన సైన్యం

  • లడఖ్ వద్ద ఘటన
  • విన్యాసాలు చేపట్టిన చైనా ఎయిర్ ఫోర్స్
  • చైనా విమానాన్ని పసిగట్టిన భారత రాడార్
  • కాసేపటికి వెళ్లిపోయిన విమానం
China plane spotted at Indian border

భారత సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలు, ఉల్లంఘనలు తెలిసిందే. 2020లో గాల్వాన్ లోయలో చైనా సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకురాగా, భారత సైనికులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. అటు, చైనా వైపు కూడా గణనీయంగానే ప్రాణనష్టం జరిగింది. దీనిపై ఇరుదేశాల మధ్య సైనికస్థాయిలో చర్చలు జరగ్గా, కొన్నాళ్లపాటు మౌనంగా ఉన్న డ్రాగన్, ఆ తర్వాత సరిహద్దుల్లో తన దూకుడు షురూ చేసింది. సరిహద్దుల్లో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలతో ఇప్పటికీ భారత్ కు ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తూనే ఉంది. 

తాజాగా, సరిహద్దుల్లో చైనా విమానం ఒకటి దూసుకొచ్చింది. ఈ విమానం లడఖ్ వద్ద భారత సైనిక స్థావరాలకు అత్యంత చేరువలో ఎగిరింది. భారత వాయుసేన రాడార్ ఈ విమానాన్ని గుర్తించడంతో వెంటనే బలగాలు అప్రమత్తం అయ్యాయి. కాసేపటికి ఆ విమానం మళ్లీ చైనా గగనతలంలోకి వెళ్లిపోయింది. 

తూర్పు లడఖ్ వద్ద సరిహద్దులకు సమీపంలోని తమ అధీనంలోని ప్రాంతాల్లో చైనా వాయుసేన విన్యాసాలు చేపట్టింది. ఇందులో పాల్గొన్న ఓ విమానమే భారత సరిహద్దులకు సమీపానికి వచ్చినట్టు వెల్లడైంది. ఈ ఘటనను భారత సైన్యం వెంటనే చైనా సైనికాధికారులకు తెలియజేసింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని స్పష్టం చేసింది. జూన్ చివరి వారంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

More Telugu News