Coffee: కాఫీ, గ్రీన్​ టీ.. ఎవరికి ఏది మంచిది? ఎవరెవరు దేనికి దూరంగా ఉండాలో తెలుసా?

  • గ్రీన్ టీ, కాఫీ రెండింటిలోనూ ఆరోగ్యానికి తోడ్పడే ప్రయోజనాలు
  • రెండింటితోనూ శరీరంలో జీవక్రియలకు తోడ్పాటు
  • కానీ రెండూ పనిచేసే తీరు వేరుగా ఉంటుందంటున్న వైద్య నిపుణులు
  • ఒక్కో తరహా వ్యక్తులకు ఒక్కో దానితో మేలు ఉంటుందని వెల్లడి
Coffee green tea which is better for whom Know who to stay away from

పొద్దున్న లేస్తే టీ గానీ, కాఫీ గానీ తాగనిదే ఏమీ తోచదు. మెల్ల మెల్లగా అవి మన సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయాయి కూడా. ఎవరైనా ఇంటికి వస్తే టీ తాగుతారా?, కాఫీ తాగుతారా? అని అడుగుతారు. ఇంత వరకు బాగానే ఉందిగానీ ఈ మధ్య జీవన శైలి వ్యాధులు, శరీర బరువు నియంత్రణపై దృష్టి కారణంగా చాలా మంది గ్రీన్ టీ వైపు చూస్తున్నారు. మరోవైపు కాఫీ ప్రియులూ ఎంతో మంది. అయితే మరి దేనితో ఎంత ప్రయోజనం అన్నది ఎప్పటికీ ఓ చిక్కు ప్రశ్నే. ఈ క్రమంలోనే వైద్య నిపుణులు ఈ రెండింటికి సంబంధించి కీలకమైన అంశాలెన్నో వెల్లడించారు. రెండూ కొంత వరకు మంచివేనని.. అయితే ఎవరెవరికి దేని వల్ల ప్రయోజనం ఉంటుందన్నది వివరిస్తున్నారు. ఆ వివరాలేమిటో చూద్దామా?

గ్రీన్ టీతో ప్రయోజనాలు ఏమిటి?
   భారత దేశంలో కాఫీ కంటే ఎక్కువగా టీ తాగుతుంటారు. ఇటీవలి కాలంలో టీ కంటే గ్రీన్ టీ తాగితే మంచిదనే ప్రచారం ఎక్కువైంది. గ్రీన్ టీతో నిజంగానే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

అత్యుత్తమ జీవ క్రియలు
శరీరంలో జీవక్రియలు వేగంగా జరగడానికి గ్రీన్ టీ దోహదం చేస్తుంది. ఉత్తమ, వేగవంతమైన జీవక్రియ ఉండటం అంటే.. సాధారణ వ్యక్తుల కంటే వేగంగా కేలరీలు కరగడానికి వీలవుతుంది. ఇది అంతిమంగా బరువు పెరగకపోవడానికి, శరీరంలో కొవ్వు శాతం తగ్గడానికి, బరువు తగ్గడానికి కూడా వీలు కల్పిస్తుంది.

కేన్సర్ కు దూరంగా ఉంచుతుంది
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ (నియంత్రణ కోల్పోయిన కణాలు)తో యాంటీ ఆక్సిడెంట్లు పోరాడుతాయి. ఇది శరీరంలో కణాలు దెబ్బతినడాన్ని నియంత్రిస్తుంది. మొత్తంగా కేన్సర్ రాకుండా ఆపుతుంది.

మెదడు పనితీరు మెరుగు పడుతుంది
కాఫీ తరహాలోనే గ్రీన్ టీలో కూడా కెఫీన్ అధిక స్థాయిలోనే ఉంటుంది. కెఫీన్ మెదడును చురుకుగా ఉంచడంలో తోడ్పడుతుంది. జ్ఞాపకశక్తి, చురుకుదనం పెంచుతుందని కూడా పలు అధ్యయనాల్లో రుజువైంది. ఏకాగ్రతను కూడా మెరుగుపరుస్తుంది. తద్వారా పని ప్రదేశంలో ఔట్ పుట్ ను పెంచుతుంది.

  • దీర్ఘకాలికంగా కూడా గ్రీన్ టీ మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా పార్కిన్ సన్స్, అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రభావాన్ని కొంత తగ్గించడానికి గ్రీన్ టీ తోడ్పడుతుందని తేలింది.

గుండెకూ మంచిదే..
గుండె, కవాటాలకు సంబంధించిన చాలా రకాల సమస్యలను గ్రీన్ టీ తగ్గిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. గ్రీన్ టీ వల్ల జీవక్రియలు వేగంగా జరిగి, శరీర బరువు నియంత్రణలో ఉండటం కూడా గుండెకు మేలు చేస్తుంది.

కాఫీతో ప్రయోజనాలు ఏమిటి?
  నీళ్లు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినియోగించే ద్రవ పదార్థం కాఫీయేనని ఒక అంచనా. మంచి చురుకు దనం ఇవ్వడంతోపాటు దీని నుంచి మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. 

కేన్సర్ కు దూరం..
గ్రీన్ టీ తరహాలోనే కాఫీలోనూ యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ ను, కణాలు దెబ్బతినడాన్ని నియంత్రిస్తాయి. తద్వారా కేన్సర్ వంటి వ్యాధులను నివారించడానికి కాఫీ తోడ్పడుతుంది.

కాలేయానికి ఆరోగ్యం
  శరీరంలో పారాక్సంథైన్ అనే రసాయనం ఉత్పత్తికి కెఫీన్ తోడ్పతుంది. ఇది కాలేయ కణాల పునరుద్ధరణకు తోడ్పతుంది. కాలేయ కేన్సర్, ఫ్యాటీ లివర్ డిసీజ్, అధిక ఆల్కాహాల్ వల్ల వచ్చే లివర్ సిర్రోసిస్, హెపటైటిస్ సీ వంటి వ్యాధుల నుంచి కాలేయం కోలుకోవడానికి వీలు కల్పిస్తుంది.

చురుకుదనం.. ఉత్సాహం
పొద్దున్నే నిద్ర మబ్బు నుంచి బయటపడటంతోపాటు ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా చురుకుదనం, ఉత్సాహం నెలకొనడానికి కాఫీ తోడ్పడుతుంది. అయితే ఉత్సాహంగా ఉంటుంది కదా అని అధికంగా కాఫీ తీసుకోవడం మాత్రం సరికాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
  • వయసు మీద పడుతున్న కొద్దీ మెదడు సామర్థ్యం తగ్గిపోవడం వల్ల వచ్చే వ్యాధులు (డిమెన్షియా, అల్జీమర్స్ వంటివి) నియంత్రణలో ఉండటానికి కూడా కాఫీలోని కెఫీన్ దోహదం చేస్తుంది.

గ్రీన్ టీకి ఎవరు దూరంగా ఉండాలి...?
  • శరీరంలో ఐరన్ లోపంతో బాధపడుతున్నవారు
  • జీర్ణ వ్యవస్థ అత్యంత సున్నితంగా ఉన్న వారు (ఇలాంటి వారికి గ్రీన్ టీ వల్ల వాంతులు, వికారం, కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది).
  • మధుమేహం ఉన్నవారు
  • యాంగ్జయిటీ, తీవ్రమైన ఉద్వేగపరమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు
  • గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు
  • కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు
  • చిన్న పిల్లలు, గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా గ్రీన్ టీకి దూరంగా ఉండటం కొంత వరకు మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

కాఫీకి ఎవరు దూరంగా ఉండాలి?
  • పది, పన్నెండేళ్లలోపు పిల్లలు
  • గుండె జబ్బులు, గుండె కొట్టుకునే వేగంలో మార్పులు ఉండే వారు
  • నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు
  • యాంగ్జయిటీ, తీవ్రమైన ఉద్వేగపరమైన సమస్యలతో బాధపడేవారు
  • ఎపిలెప్సీ (మెదడు, నాడీ సంబంధిత వ్యాధి)తో బాధపడేవారు
  • తరచూ డయేరియా బారిన పడేవారు. పొట్ట సమస్యలతో ఇబ్బందిపడేవారు
  • గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు కాఫీకి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

More Telugu News