KTR: 'కేసీఆర్.. ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్' పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్

  • పుస్తకం రచించిన మనోహర్ చిమ్మని
  • ప్రగతి భవన్ లో పుస్తకావిష్కరణ
  • మనోహర్ ను అభినందించిన కేటీఆర్
  • పుస్తకం తప్పకుండా చదువుతానని వెల్లడి
KTR launches KCR The Art Of Politics book written by Manohar Chimmani

సినీ దర్శకుడు, రచయిత మనోహర్ చిమ్మని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్థానంపై 'కేసీఆర్... ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్' అనే పుస్తకం రాశారు. ప్రగతి భవన్ లో నేడు జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, మనోహర్ చిమ్మని వంటి రచయిత ఎంతో శ్రమించి కేసీఆర్ పై ఒక మంచి పుస్తకం తీసుకురావడం హర్షణీయమని పేర్కొన్నారు. ఆయనకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. 

'కేసీఆర్... ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్' పుస్తకాన్ని తాను తప్పకుండా చదువుతానని, పుస్తకంపై తన సమీక్షను ట్విట్టర్ లో పంచుకుంటానని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాదు అని అందరూ నిరాశపరిచినా, తెలంగాణ సాధన కోసం ఎన్నో ప్రణాళికలు రూపొందించి, శక్తియుక్తులన్నీ ఉపయోగించి తెలంగాణను సాకారం చేసిన వ్యక్తి కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. గత ఆరు దశాబ్దాలుగా ఎవరూ సాధించలేకపోయిన తెలంగాణను కేసీఆర్ సాధించారని స్పష్టం చేశారు. 

తెలంగాణ కోసం రాష్ట్రంలోనూ, ఢిల్లీలోనూ అందరినీ కలుపుకుని, తన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారని వివరించారు. ఆఖరికి ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ దని కీర్తించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపారని, ఇంతజేసినా కేసీఆర్ ను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
.

More Telugu News