Jasprit Bumrah: బుమ్రా కెప్టెన్సీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ విమర్శలు

  • వ్యూహాలు సరిగ్గా లేవన్న కెవిన్ పీటర్సన్
  • గౌరవంగా చెబుతున్నానంటూ కామెంట్
  • భారత బౌలర్లు ఎంచుకున్న మార్గంపై తన అభిప్రాయం వెల్లడి
Ex England skipper slams Jasprit Bumrah captaincy on Day 4 Day 4 in India vs England 5th Test

ఇంగ్లండ్, భారత జట్ల మధ్య ఎడ్జ్ బాస్టన్ లో ఐదో మ్యాచ్ ఊహించని మలుపు తీసుకుంది. మొదటి మూడు రోజులు భారత జట్టు ఆధిపత్యాన్ని ఇంగ్లండ్ మార్చేసింది. మ్యాచ్ ను తన వైపు తిప్పుకుంది. విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో నాలుగో రోజు (సోమవారం) భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్ వ్యూహాలను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తప్పుబట్టాడు. 

378 పరుగుల లక్ష్యం మరీ తక్కువేమీ కాదు. అయినా, రోజున్నర వ్యవధి ఉండడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ లో దూకుడు ధోరణిని అనుసరించారు. టెస్ట్ మ్యాచ్ అయినా వన్డే స్టయిల్ అనుసరించారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 259 పరుగుల వద్ద ఉంది. నేటి 100 ఓవర్లలో ఇంగ్లండ్ విజయం సాధించడం సునాయాసమేనని తెలుస్తోంది. 

‘‘బుమ్రా వ్యూహాలు సరిగ్గా ఉన్నాయని నేను అనుకోవడం లేదు. ఇది కూడా నేను ఎంతో గౌరవంతో చెబుతున్నాను. రివర్స్ స్వింగింగ్ బాల్ తో బ్యాటర్ కు పని సులువు చేయడం అసాధ్యం. ఎందుకంటే 90 మైళ్ల వేగంతో వచ్చే బాల్ ఏ వైపు స్వింగ్ అవుతుందో బ్యాటర్ అర్థం చేసుకోవడం కష్టం. నాన్ స్ట్రయికర్ ఎండ్ లో బ్యాట్ చేయడమే దీనికి మేలైన పరిష్కారం. ఈ రోజు వారు అదే చేశారు’’ అని పీటర్సన్ వివరించాడు. ఇన్ అండ్ అవుట్ ఫీల్డ్ తో బౌల్ చేశారని.. రేపు (మంగళవారం) అలా చేయరని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు.

More Telugu News