Global Livability Index: నివాస యోగ్యతలో పడిపోయిన బెంగళూరు స్థానం

  • దేశంలోని ఐదు మెట్రోల్లో దిగువ స్థానం బెంగళూరుదే
  • ఈఐయూ నివాస యోగ్యత సూచీలో 146వ స్థానం
  • మౌలిక సదుపాయాల పరంగా స్కోరు 46.4
Global Livability Index 2022 Bengaluru ranked 146 scores least among Indian cities

బెంగళూరుకు ఏమైంది? 
ఒకప్పుడు గ్రీన్ సిటీగా, ఐటీ సిటీగా బెంగళూరు మెరుగైన స్థానంలో ఉండేది. కానీ, ఇటీవలి కాలంలో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు, దెబ్బతిన్న రోడ్లతో బెంగళూరు గుర్తింపు మసకబారుతోంది. తాజాగా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ‘అంతర్జాతీయ నివాస యోగ్యత సూచీ 2022’లో బెంగళూరు దేశంలోనే దిగువ స్థానంలో ఉంది. బెంగళూరుకు 146వ ర్యాంకు లభించింది.

ఆశ్చర్యకరం ఏమిటంటే, భారత మెట్రోలు ఐదింటికి ఈ జాబితాలో చోటు ఇవ్వగా.. ఇవన్నీ కూడా తక్కువ స్కోరుతో 140 నుంచి 146 మధ్యలో ఉన్నాయి. బెంగళూరు 54.4 స్కోరుతో 146వ స్థానంలో.. ఢిల్లీలో 56.5 స్కోరుతో 140వ స్థానంలో, ముంబై 56.2 స్కోరుతో 141వ స్థానంలో ఉన్నాయి. చెన్నై 55.8 స్కోరుతో 142, అహ్మదాబాద్ 55.7 స్కోరుతో 143వ ర్యాంకులు దక్కించుకున్నాయి. 

గతేడాది కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లో బెంగళూరు మొదటి స్థానంలో నిలవడం గమనించాలి. బెంగళూరు ఐటీ రాజధానే కాదు.. స్టార్టప్ లకు సైతం దేశంలోనే కేంద్ర స్థానంగా నిలుస్తోంది. ఐదు భారత మెట్రోల్లో మౌలిక సదుపాయాల పరంగా బెంగళూరుకు వచ్చిన స్కోరు 46.4 మాత్రమే. మౌలిక సదుపాయాల కొరతను ఇది సూచిస్తోంది. నాణ్యమైన రోడ్లు, ప్రజా రవాణా, అంతర్జాతీయ అనుసంధానత, టెలికాం, నీటి సదుపాయాలు, నాణ్యమైన నివాసాల ఆధారంగా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ ఈ స్కోరు కేటాయించింది.

More Telugu News