Mamata Banerjee: ‘మహా’ సర్కారు ఆరు నెలల్లో కూలిపోతుంది: మమతా బెనర్జీ

  • ‘మహా’లో కొత్త సర్కారు కొనసాగుతుందని భావించడం లేదన్న మమత
  • అధికార దుర్వినియోగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారని ఆగ్రహం
  • అభిషేక్ బెనర్జీ రాజకీయాల్లో ఉంటే ఎవరికి ప్రమాదమని ప్రశ్న
  • జై షాకు బీసీసీఐలో ఉన్నత పదవి ఎలా వచ్చిందన్న ‘దీదీ’
Mamata predicts Maha Govt will collapse in next 6 months

మహారాష్ట్రలో కొత్తగా గద్దెనెక్కిన ఏక్‌నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని ప్రభుత్వం మరో ఆరు నెలల్లో కుప్పకూలడం ఖాయమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్ ఈస్ట్-2022’ కార్యక్రమంలో పాల్గొన్న మమత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొనసాగుతుందని తాను భావించడం లేదన్నారు. అది అనైతిక, అప్రజాస్వామిక సర్కారని విమర్శించారు. వారు ప్రభుత్వాన్నయితే ఏర్పాటు చేశారు కానీ, ప్రజల హృదయాలను మాత్రం గెలవలేరన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణచివేయవచ్చని, కానీ అదే ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించి ప్రజలు మిమ్మల్ని కిందికి దింపుతారని హెచ్చరించారు. 

వారసత్వ రాజకీయాలంటూ బీజేపీ చేస్తున్న విమర్శలపైనా మమత స్పందించారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రాజకీయాల్లో ఉండడం వల్ల ఎవరికైనా ప్రమాదం ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలు అతడిని రెండుసార్లు ఎన్నుకున్నారని గుర్తు చేశారు. దేశ బాధ్యతలను యువత చేపట్టాలని మీకు లేదా? అని నిలదీశారు. వారసత్వ రాజకీయాలపై మాట్లాడుతున్న బీజేపీ అమిత్ షా కుమారుడు జై షాకు బీసీసీఐలో అత్యున్నత పదవి ఎలా దక్కిందన్నారు. దీని గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని ‘దీదీ’ స్పష్టం చేశారు.

More Telugu News