Eknath Shinde: తిరుగుబాటు వెనుక ఉన్న పెద్ద కళాకారుడు ఫడ్నవీసే... ఎమ్మెల్యేలు నిద్రపోయిన తర్వాత మేం మాట్లాడుకునేవాళ్లం: షిండే సంచలన వ్యాఖ్యలు

  • మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం
  • సీఎంగా తిరుగుబాటు వర్గం నేత ఏక్ నాథ్ షిండే
  • డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత ఫడ్నవీస్
  • అంతా ఫడ్నవీసే నడిపించాడన్న షిండే
  • కాస్త ఇబ్బందిపడిన ఫడ్నవీస్
Eknath Shinde sensational revelations about rebellion

మహారాష్ట్రలో శివసేన పార్టీలో ఏర్పడిన సంక్షోభం వెనుక తమ పాత్ర ఏమీలేదని బీజేపీ అధినాయకత్వం ఇప్పటిదాకా చెబుతూ వస్తోంది. అయితే, కొత్త సీఎం ఏక్ నాథ్ షిండే సంచలన విషయాలు వెల్లడించారు. తమ తిరుగుబాటు వెనుక ఉన్న పెద్ద కళాకారుడు ఫడ్నవీసేనని బాంబు పేల్చారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారని షిండే వివరించారు. 

"బీజేపీతో పోల్చితే మాకున్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం తక్కువ. కానీ ప్రమాణస్వీకారానికి ముందు ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. మీ వెనుక ఓ రాతిగోడలా నిలుస్తానంటూ అమిత్ షా ధైర్యం చెప్పారు. అయితే అన్నింటికి మించి అతి పెద్ద కళాకారుడు మాత్రం ఫడ్నవీసే. మా వర్గం ఎమ్మెల్యేలు హోటల్ లో నిద్రపోయిన తర్వాత నేను ఫడ్నవీస్ ని కలిసేవాడిని. నేను, ఆయన కలిసి ఏం చేయాలన్నదానిపై చర్చించుకునేవాళ్లం. మళ్లీ మా ఎమ్మెల్యేలు నిద్ర లేవడానికి ముందే నేను హోటల్ కి చేరుకునేవాడ్ని" అని షిండే వివరించారు. 

అంతేకాదు, ఈ తిరుగుబాటు వ్యవహారం మొత్తం నడిపించిన ఒకే ఒక్కడు.. ఇదిగో ఇతడే అంటూ తనపక్కన ఉన్న ఫడ్నవీస్ ను చూపించారు. ఫడ్నవీస్ ఎప్పుడు, ఏం చేస్తారో ఎవరూ కనుక్కోలేరని పొగడ్తల జల్లు కురిపించారు. అయితే షిండే వ్యాఖ్యల పట్ల ఫడ్నవీస్ కాస్త ఇబ్బందిపడినట్టు ఆయన ముఖ కవళికలు వెల్లడించాయి.

More Telugu News