Aditya Thackeray: ఒక హోటల్ నుంచి మరో హోటల్ కు ఎన్నాళ్లు తిరుగుతారు... మా కళ్లలోకి సూటిగా చూడగలరా?: రెబెల్స్ ను ప్రశ్నించిన ఆదిత్య థాకరే

  • మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం
  • సీఎం పీఠం ఎక్కిన శివసేన రెబెల్ నేత
  • తీవ్రంగా స్పందించిన ఆదిత్య థాకరే
  • ప్రజలకు ముఖం చూపించగలరా? అంటూ ఆగ్రహం
Aditya Thackeray questions rebel MLAs

మహారాష్ట్రలో శివసేన పార్టీలో పుట్టిన ముసలం ఉద్ధవ్ థాకరేను మాజీ సీఎంగా మార్చింది. శివసేన అధినాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎక్ నాథ్ షిండే ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. కాగా, షిండే వెంట నిలిచిన రెబెల్ ఎమ్యెల్యేలను ఉద్దేశించి శివసేన నేత ఆదిత్య థాకరే కీలక వ్యాఖ్యలు చేశారు. 

"ఇవాళ వచ్చిన ఏక్ నాథ్ షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు సూటిగా మా కళ్లలోకి చూడగలరా? ఒక హోటల్ నుంచి మరో హోటల్ కు ఎన్నాళ్లు తిరుగుతారు? వీళ్లు ఏదో ఒకనాడు తమ అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్లక తప్పదు. అప్పుడు ప్రజలకు తమ ముఖాలు ఎలా చూపిస్తారు?" అంటూ ప్రశ్నించారు. 

తన తండ్రి ఉద్ధవ్ థాకరే సొంత పార్టీ వాళ్ల చేతిలోనే నమ్మకద్రోహానికి గురయ్యారని ఆదిత్య థాకరే ఆవేదన వ్యక్తం చేశారు. ఏమాత్రం ఊహించలేని విధంగా విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని, సొంతం కుటుంబం లాంటి పార్టీకే వెన్నుపోటు పొడిచారని ఆక్రోశించారు. సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నవారికే ద్రోహం తలపెట్టారని మండిపడ్డారు. 

అంతేకాదు, సీఎం ఏక్ నాథ్ షిండేను ఉద్దేశించి కూడా ఆదిత్య విమర్శలు చేశారు. ఓ లగ్జరీ హోటల్ నుంచి అసెంబ్లీకి వచ్చేందుకు శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడంపై స్పందించారు. ముంబయిలో ఈ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు గతంలో ఎప్పుడూ చూడలేదని ఆదిత్య థాకరే అన్నారు. ఎందుకంత భయపడుతున్నారు? ఎవరైనా పారిపోతున్నారా ఏంటి? ఎందుకింత ఆందోళన? అంటూ ప్రశ్నించారు.

More Telugu News