Narendra Modi: ఏపీని నట్టేట ముంచిన మోదీని సీఎం స్వాగతించడమా? సిగ్గుండాలి: ఏపీ కాంగ్రెస్ చీఫ్ శైలజానాథ్ ఫైర్

  • రేపు భీమవరంలో పర్యటించనున్న మోదీ
  • ఏపీకి ఏ ముఖం పెట్టుకుని వస్తారని ప్రధానిని ప్రశ్నించిన శైలజానాథ్
  • జగన్ తన వ్యక్తిగత అజెండాను పక్కనపెట్టి న్యాయం కోసం ప్రశ్నించాలని డిమాండ్
  • రేపు, 7వ తేదీ విజయవాడలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్న పీసీసీ చీఫ్
Sake Sailajanath Slams Jagan and modi

ప్రస్తుతం హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు ఏపీలోని భీమవరంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ తీవ్రంగా స్పందించారు. అనంతపురంలోని డీసీసీ కార్యాలయంలో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన మోదీ, జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీని నట్టేట ముంచిన మోసకారి అయిన మోదీకి స్వాగతం ఎలా పలుకుతారని, అందుకు సిగ్గుండాలని జగన్‌పై ఫైర్ అయ్యారు. ఏపీని మోసం చేసిన మోదీ కూడా ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు.

జగన్ తన వ్యక్తిగత అజెండాను పక్కనపెట్టి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సభా వేదికపైనే రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలని, న్యాయం జరిగే వరకు మోదీ తిరిగి వెళ్లకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం సర్వనాశనం కావడానికి మోదీ, జగనే కారణమని ఆరోపించారు. మోదీని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వకుండా ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రేపు, ఈ నెల 7వ తేదీ విజయవాడలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు శైలజానాథ్ తెలిపారు.

More Telugu News