KCR: మంచి వ్యక్తిని రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది.. మోదీ దేశాన్ని నాశనం చేశారు: కేసీఆర్

  • రాష్ట్రపతిగా సిన్హా గెలిస్తే దేశ గౌరవం ఇనుమడిస్తుంది
  • మోదీ పాలనలో ప్రతి రంగం తిరోగమనంలోకి వెళ్లిపోయింది
  • శ్రీలంకలో మోదీ సేల్స్ మెన్ మాదిరి పని చేశారు
Modi spoiled the country says KCR

ఒక మంచి వ్యక్తిని దేశ రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున బరిలోకి దిగిన యశ్వంత్ సిన్హా ఆ పదవికి అన్ని విధాలా అర్హులని అన్నారు. అడ్వొకేట్ గా తన కెరీర్ ను ప్రారంభించిన యశ్వంత్ సిన్హా ఆ తర్వాత ఐఏఎస్ అధికారిగా, కేంద్ర ఆర్థికమంత్రిగా, విదేశాంగ మంత్రిగా అన్ని పదవుల్లో అద్భుతంగా రాణించారని చెప్పారు. ఆర్థిక, విదేశాంగ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. రాష్ట్రపతిగా యశ్వంత్ సిన్హా గెలిస్తే దేశ గౌరవం మరింత ఇనుమడిస్తుందని చెప్పారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో యశ్వంత్ సిన్హాతో కలిసి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోదీపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ పాలనలో ప్రతి రంగం తిరోగమనంలోకి వెళ్లిపోయిందని కేసీఆర్ అన్నారు. చైనాతో పోల్చితే మనం ఎక్కడున్నామని ప్రశ్నించారు. తాను వ్యక్తిగత విమర్శలు చేయడం లేదని... నిజాలే మాట్లాడుతున్నానని చెప్పారు. శ్రీలంకలో మోదీ ఒక సేల్స్ మెన్ మాదిరి పని చేశారని విమర్శించారు. తాను తినను, ఎవరినీ తిననివ్వను అని చెప్పుకునే మోదీ... ఎవరి కోసం సేల్స్ మెన్ గా మారారని ప్రశ్నించారు. స్వదేశీ బొగ్గును కాదని, విదేశాల బొగ్గును కొనాలంటూ రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. 

ఇచ్చిన హామీలను మోదీ ఏనాడైనా నెరవేర్చారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై తాము మౌనంగా ఉండబోమని... ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. ప్రసంగాలు ఇవ్వడాన్ని మానేసి... తమ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

More Telugu News