Corona Virus: హిమాలయాల మంచు కింద ప్రమాదకర బ్యాక్టీరియాలు.. బయటికి వస్తే మహమ్మారులే..!

  • మంచు అడుగున 968 రకాల కొత్త సూక్ష్మ జీవులను గుర్తించిన శాస్త్రవేత్తలు
  • అందులో వైరస్ లతోపాటు బ్యాక్టీరియాలు, ఆల్గే వంటి జీవులు కూడా..
  • వాటి జన్యువులు, ఇతర అంశాలపై చైనా శాస్త్రవేత్తల పరిశోధన
  • సుమారు 100 వైరస్ లకు వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉన్నట్టు గుర్తింపు
Great viruses under the snow if comes out could create pandemics

హిమాలయాల్లో మంచు అడుగున పెద్ద సంఖ్యలో ప్రమాదకర సూక్ష్మజీవులు కూరుకుపోయి ఉన్నట్టు చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇటీవల టిబెట్ ప్రాంతంలోని 21 గ్లేసియర్లు (భారీ మంచు నిల్వలు) మంచు అడుగు నుంచి తీసిన శాంపిల్స్ ను పరిశీలించి బ్యాక్టీరియాలు, వైరస్ లు కలిపి ఏకంగా 968 సూక్ష్మజీవులు ఉన్నట్టు తేల్చారు. వాటిపై పరిశోధన చేసి.. జీనోమ్ సీక్వెన్సింగ్, ప్రోటీన్ల విశ్లేషణ తదితర పరీక్షలు చేశారు. అందులో కొన్ని రకాల బ్యాక్టీరియాలకు అత్యంత వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉన్నట్టు గుర్తించారు. 

బయటికొస్తే ప్రమాదమే..
గ్లేసియర్ల అడుగున సూక్ష్మజీవులపై చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన పరిశోధకులు ఇటీవల పరిశోధన చేశారు. సుమారు 968 రకాల సూక్ష్మజీవులను గుర్తించగా.. అందులో 98 శాతం మేర ఇప్పటివరకు ఎవరికీ తెలియని కొత్త సూక్ష్మజీవులే కావడం గమనార్హం. అవన్నీ మంచు కింద కూరుకుపోయి ఉన్నాయని.. ఓ లెక్కన మంచు జైలులో ఉన్నట్టేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ అవి బయటికి వస్తే.. కరోనా తరహాలో మహమ్మారుల్లా మారి, ప్రపంచమంతా వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈ బ్యాక్టీరియాలపై చేసిన పరిశోధనలో 27 వేల రకాల వైరులెన్స్ ఫ్యాక్టర్స్ (మనుషులు, ఇతర జంతువులకు సోకి.. వాటి కణాల్లో భారీగా పునరుత్పత్తి చెందే సామర్థ్యం) ను గుర్తించినట్టు శాస్త్రవేత్తలు చెప్పారు. 

గ్లోబల్ వార్మింగ్ తో మంచు కరుగుతూ..

  • కొన్నేళ్లుగా వాతావరణ మార్పులు, మండుతున్న ఎండలతో హిమాలయాల్లో మంచు కరిగిపోతోందని.. ఇదిలాగే కొనసాగితే దాని కింద కూరుకుపోయి ఉన్న ప్రమాదకర సూక్ష్మజీవులు బయటికి వస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. 
  • సాధారణంగా బ్యాక్టీరియాలకు తమ జెనెటిక్ కోడ్ ను పంచుకునే లక్షణం ఉంటుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. గ్లేసియర్ల లోని బ్యాక్టీరియాలు, బయట వాతావరణంలోని బ్యాక్టీరియాలు జెనెటిక్ కోడ్ ను పంచుకుంటే.. అన్ని వాతావరణాలను, పరిస్థితులను తట్టుకునేలా మారుతాయని చెబుతున్నారు. 
  • ఇదే జరిగితే మానవాళికి కొత్త కొత్త మహమ్మారుల ముప్పు పొంచి ఉన్నట్టేనని హెచ్చరిస్తున్నారు.

More Telugu News