MNS: 'జాగ్రత్త' అంటూ షిండేకు రెండు సూచనలు చేసిన రాజ్ థాకరే!

  • షిండేకు అభినందనలు తెలిపిన రాజ్ థాకరే
  • వచ్చిన అవకాశాన్ని సమర్థతతో నిరూపించుకోవాలని వ్యాఖ్య
  • అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయండని సూచన
Raj Thackeray gives two suggestions to Eknath Shinde

బీజేపీ అండతో శివసేన రెబెల్స్ నేత ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన సంగతి తెలిసిందే. తొమ్మిది రోజుల రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ... నిన్న రాత్రి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. మరోవైపు, షిండేకు మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సోదరుడు, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే రెండు సూచనలు చేశారు. 

'మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన మీకు హృదయపూర్వక అభినందనలు. మాకు ఇదొక సంతోషకర సమయం. ముఖ్యమంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని మీ సమర్థతతో నిరూపించుకోండి. అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయండి. మరోసారి మీకు అభినందనలు' అని రాజ్ థాకరే ట్వీట్ చేశారు. 

మరోవైపు, ఉద్ధవ్ థాకరే పేరును ప్రస్తావించకుండా రాజ్ థాకరే చేసిన మరో ట్వీట్ వైరల్ అవుతోంది. 'ఒక వ్య‌క్తి త‌న అదృష్టాన్ని సొంత విజ‌యంగా భావించిన నాటి నుంచే అత‌ని ప‌త‌నం మొదల‌వుతుంది' అంటూ స‌ద‌రు ట్వీట్‌లో రాజ్ థాక‌రే పేర్కొన్నారు. బీజేపీ పొత్తుతో ఎన్నికల్లో గెలిచిన ఉద్ధవ్ థాకరే... సీఎం పదవి కోసం బీజేపీకి దూరంగా జరిగి కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలను ఉద్దేశించే రాజ్ థాకరే ఈ ట్వీట్ చేసినట్టు భావిస్తున్నారు

ఇంకోవైపు, శివసేన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో రాజ్ థాకరే చాలా మౌనంగా ఉన్నారు. జరుగుతున్న పరిణామాలను మౌనంగా గమనిస్తూ గడిపారు. మరోవైపు ఇదే సమయంలో రాజ్ థాకరేతో షిండే రెండు సార్లు మాట్లాడినట్టు తెలుస్తోంది.

More Telugu News