Sajjala Ramakrishna Reddy: ల్యాప్ టాప్ లు ఇవ్వకపోతే ప్రశ్నించాలి కానీ...!: సజ్జల

  • ల్యాప్ టాప్ లకు సరిపడా డబ్బులు ఇచ్చామన్న సజ్జల
  • ల్యాప్ టాప్ లకు మంగళం అని రాశారని ఆరోపణ
  • పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం
  • ప్రభుత్వంపై ద్వేషం వెళ్లగక్కుతున్నారని విమర్శ  
Sajjala opines on laptops issue

ఏపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకంలో భాగంగా నగదుకు బదులు ల్యాప్ టాప్ లు (కోరుకుంటే) ఇస్తామని గతంలో ప్రకటించడం తెలిసిందే. అయితే, కొన్నిరోజుల కిందట సీఎం జగన్ ఎనిమిదో తరగతిలో విద్యార్థులకు ట్యాబ్ లు ఇస్తామని వెల్లడించారు. దాంతో, ల్యాప్ టాప్ లకు మంగళం అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ల్యాప్ టాప్ ల అంశంపై పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ల్యాప్ టాప్ లు ఇవ్వకపోతే ప్రశ్నించాలని, ల్యాప్ టాప్ కు సరిపడా డబ్బులు ఇచ్చినా గానీ తప్పుడు రాతలు రాస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న ద్వేషంతోనే ఈ విధంగా అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

అంతేకాకుండా, మద్యంలో విషపదార్థాలు ఉన్నాయంటూ ప్రతిరోజూ ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అనేక బ్రాండ్లను తీసుకువచ్చిన విషయం మర్చిపోయారా? అంటూ సజ్జల ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక్క డిస్టిల్లరీకి కూడా అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకు అధికారం లేదన్న బాధతో పచ్చ మీడియా చేస్తున్నంత దుష్ప్రచారం మరెక్కడా కనిపించదని విమర్శించారు.

More Telugu News