Auto: శ్రీ సత్యసాయి జిల్లా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం జగన్

  • గుండంపల్లి వద్ద దుర్ఘటన
  • ఆటోపై తెగిపడిన హైటెన్షన్ వైర్లు
  • ఐదుగురు మహిళా కూలీల సజీవదహనం
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్
  • ప్రస్తుతం ప్యారిస్ లో ఉన్న సీఎం
CM Jagan announces ex gratia for victims families

శ్రీ సత్యసాయి జిల్లా గుండంపల్లి వద్ద ఓ ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడిన ఘటనలో ఐదుగురు మహిళా కూలీలు సజీవదహనం కావడం తెలిసిందే. ఈ ఘోరప్రమాదంపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం ప్యారిస్ లో ఉన్న ఆయన ఈ ఘటన వివరాలను తన కార్యాలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహిళా కూలీలు దుర్మరణం పాలవడంపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను అదేశించారు. గాయపడిన మరో మహిళకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. 

అటు, ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. ఈ దుర్ఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. మంటల్లో చిక్కుకుని కూలీలు సజీవ దహనమవడం తీవ్ర విచారకరమని పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

More Telugu News