Moeen Ali: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. విజేత ఎవరో చెప్పిన మోయిన్ అలీ

  • ఇంగ్లండ్ జట్టే ఫేవరెట్ అన్న మోయిన్ అలీ
  • రాహుల్, రోహిత్ లేకపోవడం భారత్ కు ప్రతికూలమని వ్యాఖ్య
  • జులై 17 వరకు ఇరు జట్ల మధ్య టెస్ట్, టీ20, వన్డే మ్యాచ్ లు
Moeen Ali predicts which way India vs England fifth Test will go

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జులై 1న ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్ ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. గతేడాది నాలుగు టెస్ట్ ల సిరీస్ లో ఒక టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉంది. కరోనా కారణంగా నాడు అర్థాంతరంగా వాయిదా పడడంతో, మిగిలిన మ్యాచ్ ఇప్పుడు జరగనుంది. నిరుడు ఆడిన మూడింటిలో భారత్ రెండు మ్యాచుల్లో గెలవగా, ఇంగ్లండ్ ఒక విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ గెలిస్తే సిరీస్ ను సమం చేయవచ్చు. భారత్ గెలిస్తే సిరీస్ తన వశం అవుతుంది. 

ఇక ఇప్పుడు రెండు జట్లలో ఎవరికి విజయావకాశాలు ఉంటాయన్న దానిపై ఇంగ్లండ్ ఆటగాడు మోయిన్ అలీ తన అంచనాలను వెల్లడించాడు. న్యూజిలాండ్ ను వరుసగా మూడు మ్యాచుల్లో ఓడించి ఇంగ్లండ్ జట్టు బలంగా ఉందన్నాడు. 

‘‘ఈ సిరీస్ గతేడాదే పూర్తయి ఉంటే భారత్ సొంతం అయ్యేది. నాలుగైదు వారాల క్రితం నన్ను అడిగినా, భారత్  విజయం సాధిస్తుందని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు చెబుతున్నా.. ఇంగ్లండ్ విజయం సాధిస్తుంది’’ అని అలీ వివరించాడు. భారత్ పూర్తిగా కాకమీదున్న జట్టు కాదని వ్యాఖ్యానించాడు. 

భారత్ తో పోలిస్తే ఇంగ్లండ్ జట్టు ఫేవరెట్ గా ఉందన్నాడు. ‘‘మూడు టెస్ట్ మ్యాచుల్లో చక్కగా ఆడింది. వారి మైండ్ సెట్ మారినందున సానుకూల దృక్పథంతో ఆడతారు. గతేడాది సెంచరీలు బాదిన ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం భారత్ కు ప్రతికూలమేనన్నాడు. 

ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ కాంబినేషన్, గతేడాది బ్యాటింగ్ చేసిన తీరు ఇంగ్లండ్ జట్టుకు సమస్యగా మారిందని మోయిన్ అలీ పేర్కొన్నాడు. భారత్ కు వారు గొప్ప ఆరంభాలను ఇచ్చినట్టు చెప్పాడు. కనుక ఇంగ్లండ్ జట్టే ఫేవరేట్ గా కినిపిస్తోందన్నాడు. 

జులై 1 నుంచి 17 వరకు భారత్-ఇంగ్లండ్.. ఒక టెస్ట్ మ్యాచ్, మూడు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనున్నాయి.

More Telugu News