Team India: ఇంగ్లండ్ తో టెస్టులో బుమ్రాకు కెప్టెన్సీ దాదాపు ఖాయమే!

  • ఐదు రోజులుగా ఐసోలేషన్ లో రోహిత్
  • నేడు మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్టు 
  • అందులో ఫలితాన్ని బట్టి ఇంగ్లండ్ తో టెస్టులో ఆడటంపై తుది నిర్ణయం
  • రోహిత్ ఆడకుంటే బుమ్రాకు టెస్టు జట్టు కెప్టెన్సీ ఖాయం 
Confusion over Rohit Sharma participation in test match against England

ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి జరిగే ఐదో టెస్ట్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. కరోనా బారిన పడిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం అవ్వడం దాదాపు ఖాయమైంది. ఎందుకంటే బుధవారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లోనూ రోహిత్ కు పాజిటివ్‌ రిజల్ట్‌ వచ్చింది. దీంతో అతను హోటల్‌ గదిలోనే ఐసోలేషన్‌లో ఉండిపోయాడు.

 రోహిత్ టెస్టు మ్యాచ్ కు అందుబాటులో లేకుంటే స్టార్ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను తాత్కాలిక కెప్టెన్ గా నియమించాలని సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ నిర్ణయించాడని తెలుస్తోంది. అయితే, రోహిత్ గైర్హాజరీ, బుమ్రాకు కెప్టెన్సీ విషయంపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ, బోర్డు పెద్దలు మాత్రం మీడియాకు లీకులు ఇచ్చారు. 

 అయితే, నిన్న హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ.. రోహిత్ ఇంకా దూరం అవ్వలేదని ప్రకటించాడు. దాంతో, రోహిత్ విషయంలో మరింత గందరగోళం ఏర్పడింది. రోహిత్ కు గురువారం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తారని చెప్పాడు. అందులో ఫలితాన్ని బట్టే తుది నిర్ణయం ఉంటుందని తెలిపాడు.  

 కానీ, టెస్టు మ్యాచ్ కు ఒక్క రోజు మాత్రమే సమయం ఉండటం, జట్టుతో కలవాలంటే రెండు ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో  నెగెటివ్ గా తేలాల్సిన అవసరం ఉండటంతో రోహిత్ ఆడే పరిస్థితి కనిపించడం లేదు. పైగా, ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా ఐదు రోజులుగా హోటల్ గదికి పరిమితమైన వ్యక్తిని నేరుగా ఆడించడం అంటే ప్రమాదంతో కూడుకున్న నిర్ణయం అవుతుంది. దాంతో, రోహిత్ దూరం అవ్వడం.. అతని స్థానంలో బుమ్రాను స్టాండిన్ కెప్టెన్ గా నియమించడం దాదాపు ఖాయమే అనొచ్చు.
 
అదే జరిగితే బుమ్రా సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. 35 ఏళ్ల తర్వాత టీమిండియా టెస్ట్‌ జట్టును నడిపించనున్న తొలి పేసర్‌గా బుమ్రా నిలుస్తాడు. 1987లో కపిల్‌ దేవ్‌ నాయకత్వం తర్వాత మరో పేసర్ భారత జట్టుకు టెస్టుల్లో  కెప్టెన్సీ వహించలేదు. ఇప్పుడు ఆ అరుదైన అవకావం బుమ్రాకు రానుంది. ఇప్పటివరకు 29 టెస్టులు ఆడిన బుమ్రా 123 వికెట్లు తీశాడు. ప్రపంచంలో అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు.

More Telugu News