PSLV- C53: కొరియా, సింగపూర్ ఉపగ్రహాలను నేడు నింగిలోకి పంపనున్న పీఎస్‌ఎల్‌వీ.. కొనసాగుతున్న కౌంట్‌డౌన్

  • సరిగ్గా సాయంత్రం 6.02 గంటలకు నింగిలోకి పీఎస్ఎల్‌వీ-సి53
  • ఎన్ఎస్ఐఎల్‌లో చేపడుతున్న వాణిజ్యపరమైన రెండో ప్రయోగం
  • అంతరిక్ష వ్యర్థాలు అడ్డువచ్చే అవకాశం ఉండడంతో రెండు నిమిషాల ఆలస్యంగా ప్రయోగం
Countdown begins for ISROs PSLV C53 mission

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. నేటి సాయంత్రం పీఎస్ఎల్‌వీ-సి53ని నింగిలోకి పంపనుంది. సింగపూర్, కొరియాకు చెందిన మూడు ఉపగ్రహాలతో సాయంత్రం సరిగ్గా 6.02 గంటలకు నింగిలోకి ఇది దూసుకెళ్తుంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL)లో భాగంగా చేపడుతున్న వాణిజ్యపరమైన రెండో ప్రయోగం ఇది. పీఎస్ఎల్‌వీ శ్రేణిలో ఇది 55వ ప్రయోగం కాగా, ఇందులో సింగపూర్‌కు చెందిన రెండు, కొరియాకు చెందిన ఒక ఉపగ్రహం ఉన్నాయి. 

పీఎల్ఎల్‌వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ (POEM) డీఎస్-ఈవో ఉపగ్రహం బరువు 365 కేజీలు. ఇది 0.5 మీటర్ల రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యంతో ఎలక్ట్రో ఆప్టిక్, మల్టీ-స్పెక్ట్రల్ పేలోడ్‌ను కలిగి ఉంది. అలాగే, ఎన్ఈయూఎస్ఏఆర్ అనేది ఎస్ఏఆర్ పేలోడ్‌ను మోసుకెళ్లే ఉపగ్రహం. సింగపూర్‌కు చెందిన ఇది మొట్టమొదటి బుల్లి వాణిజ్య ఉపగ్రహం. దీనిని నన్యాంగ్ టెక్నోలాజికల్ యూనివర్సిటీ (NTU) రూపొందించింది. దీని బరువు 2.8 కిలోలు.

రాకెట్ ప్రయోగ సమయంలో అంతరిక్ష వ్యర్థాలు అడ్డువచ్చే అవకాశం ఉండడంతో ప్రయోగాన్ని రెండు నిమిషాలు ఆలస్యంగా చేపడుతున్నారు. నిన్న సాయంత్రం 4.02 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 26 గంటలపాటు కొనసాగి నేటి సాయంత్రం 6.02 గంటలకు నింగిలోకి దూసుకెళ్తుంది. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరగనుంది.

More Telugu News