bonalu: నేటి నుంచే తెలంగాణ బోనాలు.. గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్మమ్మకు తొలి బోనం

  • అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న రాష్ట్ర మంత్రులు
  • 17న సికింద్రాబాద్ ఉజ్జయిని, 24న పాతబస్తీ బోనాలు
  • జులై 28 వరకు నెల రోజుల సంబురాలు
telangana Bonalu festival starts today

తెలంగాణలో బోనాల సందడి మొదలైంది. ఆషాఢమాసం బోనాలకు చారిత్రక గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో గురువారం అంకురార్పణ జరుగుతుంది. గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారి బోనాల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. బోనాలను ప్రారంభించే రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్ర్తాలు అందచేయడం ఆనవాయితీ. గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 

ఉదయం లంగర్ హౌస్ చౌరస్తా నుంచి అమ్మవారి రథం, భారీ తొట్టెల ఊరేగింపు ప్రారంభమై గోల్కొండ కోటకు చేరుకుంటుంది. మధ్యలో చోట బజార్లోని పూజారి అనంత చారి ఇంట్లో అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఊరేగింపు సాయంత్రానికి కోటలోని జగదాంబిక మహంకాళి(ఎల్లమ్మ) అమ్మవారి దేవాలయానికి చేరుకుంటుంది. కోటపైన అమ్మవారికి భారీ తొట్టెలను సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. 

గోల్కొండ కోటలో జగదాంబికా బోనాల జాతరకు లక్షలాది భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో గోల్కొండ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  800 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. షీ టీమ్స్, మహిళా పోలీసులు, అశ్వక దళంతో పాటు సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. 

తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు నగరంలో నెల రోజుల పాటు జరగనున్నాయి. చారిత్రక గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జూన్‌ 30 నుంచి జులై 28 వరకు ఆషాఢ మాసం బోనాలు జరుగుతాయి. గోల్కొండ బోనాల తర్వాతి వారం ల‌ష్కర్‌ (సికింద్రాబాద్)లో, ఆ త‌ర్వాత లాల్ ద‌ర్వాజా, ధూల్ పేట‌, బ‌ల్కంపేట‌, పాతబ‌స్తీ అమ్మవారి ఆల‌యాల్లో బోనాల ఉత్సవం జరుగుతుంది. జులై 17న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, 18న రంగం భవిష్యవాణి ఉంటుంది. జులై 24న పాతబస్తీ బోనాలు, 25న ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు.

More Telugu News