Maharashtra: రేపే అసెంబ్లీలో బల పరీక్ష.. నెగ్గేది మేమే: ఏక్​ నాథ్​ షిండే

  • తమకు 50 మంది ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతు ఉందన్న షిండే 
  • మూడింట రెండొంతుల కన్నా ఎక్కువ మెజార్టీ తమకేనని వ్యాఖ్య 
  • ఇదంతా మహారాష్ట్ర, హిందూత్వ అభివృద్ధి కోసమేనని వివరణ 
  • బీజేపీతో కలవడంపై బల పరీక్ష తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
we have support of 50 mlas will pass floor test says eknath shinde

మహారాష్ట్ర అసెంబ్లీలో తమకు మూడింట రెండొంతుల కన్నా ఎక్కువ మెజారిటీ ఉందని.. రేపు జరిగే బల పరీక్షలో గెలిచేది తామేనని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నేత ఏక్ నాథ్ షిండే పేర్కొన్నారు. బల పరీక్షపై తమకు ఎలాంటి ఆందోళనా లేదని.. పరీక్షలో నెగ్గుతామని స్పష్టం చేశారు. అసోం రాజధాని గువాహటిలోని ఓ స్టార్ హోటల్ లో క్యాంపు వేసిన ఆయన.. బుధవారం అక్కడి కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.

 ‘‘50 మంది శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతు మాకు ఉంది. బల పరీక్షలో మేమే విజయం సాధిస్తాం. మూడింట రెండొంతుల మంది కన్నా ఎక్కువ మంది మా వెంట ఉన్నారు. బల పరీక్షకు సంబంధించి మాకు ఎలాంటి ఆందోళనా లేదు. మేం చేస్తున్నదంతా మహారాష్ట్ర, హిందుత్వ అభివృద్ధి కోసమే..” అని ఏక్ నాథ్ షిండే పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సంఖ్యాబలం, మెజార్టీనే ముఖ్యమని.. తమను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిధిని దాటి వెళ్లాల్సిన అవసరం ఎవరికీ లేదని పేర్కొన్నారు.

బల పరీక్ష తర్వాత నిర్ణయం
గురువారం బలాన్ని నిరూపించుకోవాలంటూ ఉద్ధవ్ థాకరేను మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ ఆదేశించడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీ వెంట నడుస్తారా, ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై మీడియా ప్రశ్నించగా.. బల పరీక్ష తర్వాత తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా సమావేశమై నిర్ణయం తీసుకుంటారని ఏక్ నాథ్ షిండే పేర్కొన్నారు.

More Telugu News