Andhra Pradesh: మాకు తెలియ‌కుండానే మా ఖాతాల నుంచి రూ.800 కోట్ల విత్‌డ్రా.. ఏపీ ఉద్యోగుల ఆందోళ‌న‌

  • 90 వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి డ‌బ్బు విత్ డ్రా
  • సోమ‌వారం రాత్రి నుంచే ఉద్యోగుల‌కు మెసేజ్‌లు వ‌స్తున్నాయ‌న్న సూర్య‌నారాయ‌ణ‌
  • దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తామ‌ని వెల్ల‌డి
  • 6 నెలల పీఆర్సీ డీఏ బ‌కాయిల‌ను లాగేశారంటూ ఆవేద‌న‌
ap government employees alleges cash in their pf accounts withdrawn with out their consent

ఏపీ ఉద్యోగులు మంగ‌ళ‌వారం తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఉద్యోగుల‌కు సంబంధించిన పీఎఫ్ ఖాతాల నుంచి వారికి తెలియ‌కుండానే పెద్ద మొత్తంలో డ‌బ్బులు విత్‌డ్రా అయ్యాయ‌ని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని 90 వేల మంది ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నుంచి వారికి తెలియ‌కుండానే ఏకంగా రూ.800 కోట్లు విత్ డ్రా అయిన‌ట్లు ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్య‌నారాయ‌ణ ఆరోపించారు. పీఆర్సీ బ‌కాయిల నిధుల‌ను విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం తిరిగి ఆ నిధుల‌ను విత్ డ్రా చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నుంచి నిధులు విత్ డ్రా అయ్యాయ‌ని సూర్య‌నారాయ‌ణ తెలిపారు. ఈ మేర‌కు ఉద్యోగుల‌కు రాత్రి నుంచే మెసేజ్‌లు వ‌స్తున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. ఈ న‌గ‌దు ఎవ‌రు తీసుకున్నారో కూడా తెలియ‌డం లేద‌ని ఆయ‌న ఆరోపించారు. త‌న ఖాతా నుంచే రూ.83 వేలు విత్‌డ్రా అయ్యింద‌ని ఆయ‌న తెలిపారు. గ‌తంలో ఓ సారి ఇలాగే జ‌రిగితే ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేశామ‌న్న ఆయ‌న మ‌రోమారు అలాగే జ‌రిగింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

పీఆర్సీ డీఏ బ‌కాయిల‌ను పీఎఫ్ ఖాతాల‌కు జ‌మ చేయ‌నున్న‌ట్లు గ‌తంలోనే ప్ర‌భుత్వం తెలిపింద‌ని సూర్య‌నారాయ‌ణ తెలిపారు. ఇలా 6 నెల‌లుగా జ‌మ అయిన పీఆర్సీ డీఏ బ‌కాయిలు ఇప్పుడు విత్ డ్రా అయ్యాయ‌న్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళితే ఆర్థిక శాఖ అధికారులు లేర‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ వ్య‌వ‌హారం ప్ర‌భుత్వానికి తెలిసే జరిగిందా?  లేదంటే అధికారుల త‌ప్పిద‌మో తెలియ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. 

త‌మ అనుమ‌తి లేకుండా త‌మ ఖాతాల నుంచి డ‌బ్బులు విత్‌డ్రా చేయడం నేర‌మేన‌ని సూర్య‌నారాయ‌ణ అన్నారు. ఈ వ్య‌వ‌హారంపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్లడించారు. మార్చిలో జ‌రిగిన లావాదేవీల‌ను త‌మ‌కు చెప్ప‌క‌పోవ‌డం కూడా త‌ప్పిద‌మేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. త‌మ అనుమ‌తి లేకుండా త‌మ ఖాతాల నుంచి డ‌బ్బులు విత్‌డ్రా చేసే సాంకేతికత‌ ఉండ‌టం చ‌ట్ట‌బ‌ద్ధ‌మేనా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

More Telugu News