elon musk: ఆఫీసుకి రావాల్సిందే అన్నాడు.. వస్తే కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవు.. ప్రపంచ కుబేరుడి కంపెనీలో ఉద్యోగుల కష్టాలెన్నో!

  • వర్క్ ఫ్రమ్ హోం తీసేసి ఆఫీసుకు రావాలని ఆదేశించిన సీఈవో ఎలన్ మస్క్
  • కాలిఫోర్నియా ఆఫీసుకు వచ్చిన ఉద్యోగులకు సమస్యల స్వాగతం
  • పట్టించుకోని ప్రపంచ కుబేరుడు మస్క్    
Tesla reportedly doesnt have enough desks after remote employees returns to office

ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటి టెస్లా. దాని అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. అలాంటి వ్యక్తి కంపెనీలో పని చేసే ఉద్యోగులు అదృష్టవంతులు.. ఎక్కడాలేని సౌకర్యాలను వారు అస్వాదిస్తారని అనుకుంటే తప్పులో కాలేసినట్టే. టెస్లా కంపెనీ ఉద్యోగులు ఇప్పుడు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తమ వాహనాలకు పార్కింగ్ దగ్గరి నుంచి ఆఫీసులో కూర్చొని పని చేసేందుకు కుర్చీలు, డెస్కులు లేక అనేక సమస్యల మధ్య తీవ్ర ఒత్తిడిలో పని చేస్తున్నారు.   

కరోనా నేపథ్యంలో తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసేలా ఇచ్చిన సౌలభ్యాన్ని మస్క్ ఇటీవలే రద్దు చేశారు. ప్రతి ఉద్యోగి ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. లేదంటే ఉద్యోగాలు కోల్పోతారని హెచ్చరించారు. దాంతో, ఉద్యోగులంతా ఆఫీసుకు పరుగెత్తుకుంటూ వచ్చారు. కానీ, ఆఫీసు పరిస్థితి చూసి అవాక్కయారు.  కాలిఫోర్నియా ఫ్రీమాంట్లోని టెస్లా కర్మాగారంలో ఉద్యోగులకు కనీస సౌకర్యాలు కొరవడ్డాయని ‘ది ఇన్ఫర్మేషన్’ వెబ్ సైట్ పేర్కొన్నది. 

పార్కింగ్ స్పాట్‌లు లేకపోవడం, కూర్చోవడానికి డెస్క్ కనిపించకపోవడంతో పాటు చెత్త  వై ఫై కారణంగా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని చెప్పింది. కొంత మంది తమ కార్లను సమీపంలోని బార్ట్ స్టేషన్‌లో పార్క్ చేసి ఆఫీసుకు వచ్చారని తెలిపింది. కానీ, ఆఫీసులో కూర్చోని పని చేయడానికి డెస్కులు సరిపోలేదని చెప్పింది. ఎలాగోలా కూర్చున్నప్పటికీ వై ఫై సిగ్నల్ బలహీనంగా ఉండటంతో పని చేయలేకపోయారని వివరించింది. కానీ, వీటిని మస్క్ పట్టించుకోవడం లేదని తెలిపింది. ఉద్యోగులను తిరిగి ఆఫీస్ నుంచి పని చేయించే విషయంలో మస్క్ ప్రణాళిక విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి.

More Telugu News