Vladimir Putin: పుతిన్ మరో రెండేళ్లకు మించి బతికే అవకాశాలు లేవు: ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారి

  • పుతిన్ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందన్న ఉక్రెయిన్ నిఘా అధికారి
  • రష్యాలో తాను రహస్యంగా పర్యటించినప్పుడు ఈ విషయం తెలిసిందని వెల్లడి
  • తనకు కచ్చితమైన సమాచారం అందిందని వ్యాఖ్య
Putin may not survive more than two years says Ukraine intelligence officer

69 ఏళ్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తోందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభమైన తర్వాత మిలిటరీ అత్యున్నత అధికారులతో ఆయన తరచుగా సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా రష్యా అధికారికంగా విడుదల చేస్తున్న చిత్రాల్లో ఆయన అస్వస్థతతో ఉన్నట్టుగా అర్థమవుతోంది. మరోవైపు మాస్కోలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పుతిన్ ఎక్కువ సేపు నిలబడలేకపోయిన సంగతి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. మరో కార్యక్రమంలో ఆయన చాలా నీరసంగా కనిపించారు. ముందుకు, వెనుకకు ఊగుతూ కనిపించారు. 

ఈ క్రమంలో ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారి మేజర్ జనరల్ కైరిలో బుడానోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ఆరోగ్యం చాలా వేగంగా క్షీణిస్తోందని చెప్పారు. రెండేళ్లకు మించి ఆయన జీవించే అవకాశాలు ఏమాత్రం లేవని అన్నారు. ఇటీవలే తాను రష్యాలో రహస్యంగా పర్యటించానని... తనకు ఈ మేరకు కచ్చితమైన సమాచారం అందిందని చెప్పారు. 

మరోవైపు పుతిన్ కంటిచూపు కూడా తగ్గినట్టు వార్తలు వస్తున్నాయి. పుతిన్ ఇప్పటికే క్యాన్సర్ బాధితుడని, ఆయనకు గతంలో క్యాన్సర్ సర్జరీ కూడా జరిగిందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు క్యాన్సర్ మరింత ముదిరిందని అంటున్నారు. ఇంకోవైపు బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుతిన్ కు వైద్యులు సూచించినట్టు సమాచారం.

More Telugu News