Ponnada Satish Kumar: నన్ను, నా భార్యను ఇంట్లో పెట్టి తగలబెట్టాలని చూశారు.. రాజకీయాలు వదిలేద్దామనుకున్నా: ఎమ్మెల్యే పొన్నాడ

  • జగన్ ఇచ్చిన ధైర్యంతోనే  తిరిగి వచ్చానన్న పొన్నాడ
  • తనను అంతమొందించేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నాయని ఆవేదన
  • కోనసీమ జిల్లా పదేళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్న సతీష్ కుమార్
  • ఆయనలాంటి బాధే తనలోనూ ఉందన్న మంత్రి పినిపే విశ్వరూప్
Jagan told me not to quit politics says mla ponnada

తనను, తన భార్యను ఇంట్లో పెట్టి తగలబెట్టాలని చూశారని, దీంతో రాజకీయాల్లో కొనసాగడం సరికాదని భావించానని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ అన్నారు. ఇదే విషయం సీఎం జగన్‌కు చెప్పేందుకు వెళ్లానని, అయితే, ఆయనిచ్చిన ధైర్యంతో కొనసాగాలని అనుకున్నానని, అందుకే తిరిగి వచ్చానని పేర్కొన్నారు. మంత్రి పినిపే విశ్వరూప్ అధ్యక్షతన నిన్న వైసీపీ అమలాపురం నియోజకవర్గ ప్లీనరీలో పాల్గొన్న పొన్నాడ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

మంత్రి విశ్వరూప్‌తోపాటు తనను అంతమొందించేందుకు కొన్ని శక్తులు, కొందరు వ్యక్తులు కుట్ర పన్నారని ఆరోపించారు. అల్లర్ల కారణంగా కోనసీమ జిల్లాలో తమకంటే ప్రజలకే ఎక్కువ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడికి పరిశ్రమలను, ప్రాజెక్టులను తీసుకురావాలని అనుకున్నామని, తమనే తగలబెట్టాలని చూసిన ఇక్కడికి పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అల్లర్ల కారణంగా కోనసీమ జిల్లా పదేళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. 

కోనసీమ ఘన చరిత్రను తీసేయాలని, చెరిపేయాలని తాను ఎక్కడా చెప్పలేదన్నారు. ఆ పేరును కొనసాగిస్తూనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని మాత్రమే సూచించానని చెప్పుకొచ్చారు. మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ.. తమ ఇంట్లో ప్రమాదం జరగడానికి ఐదు నిమిషాల ముందే తన భార్య తప్పించుకుందని అన్నారు. సతీష్ లాంటి బాధే తనలోనూ ఉందని పేర్కొన్నారు.

More Telugu News