YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిదే కీలక పాత్ర.. బెయిలు ఇవ్వొద్దు: హైకోర్టును కోరిన సునీత

  • హత్యకు ప్లాన్ చేసింది,  సాక్ష్యాలను ధ్వంసం చేసిందీ ఆయనేనన్న సునీత తరపు న్యాయవాది
  • ఆయనకు బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఆరోపణ
  • ఆయన బెయిలుకు అర్హుడన్న దేవిరెడ్డి తరపు న్యాయవాది
wont give bail to devireddy asks viveka daughter to ap high court

ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టుకు తెలిపారు. హత్యకు ప్లాన్ చేయడం నుంచి సాక్ష్యాలను ధ్వంసం చేసే వరకు ఆయన పాత్ర ఉందన్నారు. కాబట్టి దిగువ కోర్టులో విచారణ పూర్తయ్యే వరకు ఆయనకు బెయిలు ఇవ్వొద్దని, ఇస్తే కనుక సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి ఆయన పెట్టుకున్న బెయిలు పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. తన తండ్రి హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని అప్పటి డీజీపీని సునీత కలిసి కోరారని, దానికి ఆయన స్పందిస్తూ.. శివశంకర్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తనకు రెండు కళ్లు లాంటి వారని సీఎం జగన్ తనకు చెప్పినట్టు డీజీపీ ఆమెకు వివరించారని అన్నారు. 

సునీత ఇదే విషయాన్ని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోనూ పేర్కొన్నారని గుర్తు చేశారు. దేవిరెడ్డి ప్రస్తుతం వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని, అధికారులంతా ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసుల సహకారం లేకుండా దర్యాప్తు తుది దశకు చేరుకోదని, కాబట్టి ఆయనకు బెయిలు ఇవ్వొద్దని సునీత తరపు న్యాయవాది నిన్న కోర్టును అభ్యర్థించారు.

దేవిరెడ్డి తరపు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. దస్తగిరి వాంగ్మూలం తప్ప ఈ హత్య ఘటనలో దేవిరెడ్డి పాత్ర ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఆరున్నర నెలలుగా ఆయన జుడీషియల్ కస్టడీలో ఉన్నారని, సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో బెయిలుకు దేవిరెడ్డి అర్హుడని పేర్కొన్నారు. ఒకవేళ ఏపీలో కాకుంటే మరే రాష్ట్రంలోనైనా ఉండేలా షరతు విధించి బెయిలు ఇవ్వాలని కోరారు. సునీత, దేవిరెడ్డి తరపు వాదనలు ముగియడంతో ఇతర నిందితుల వాదనలు నేడు జరగనున్నాయి.

More Telugu News