USS Benfold: దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించిన అమెరికా యుద్ధ నౌక... భగ్గుమంటున్న చైనా

  • తైవాన్ కు చేరువలోకి వచ్చిన యూఎస్ఎస్ బెన్ ఫోల్డ్
  • నిన్న తైవాన్ జలసంధిపై అమెరికా విమానం చక్కర్లు
  • దీని వెనుక అంతర్యం ఏమిటన్న చైనా
  • అమెరికా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం
USS Benfold enters South China Sea

తైవాన్ అంశంలో అమెరికా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ బెన్ ఫోల్డ్ ప్రవేశించిన నేపథ్యంలో చైనా తీవ్రంగా స్పందించింది. అమెరికా యాంటీ సబ్ మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్ పీ-8ఏ తైవాన్ జలసంధిపై చక్కర్లు కొట్టిన మరుసటి రోజే ఈ యుద్ధనౌక రావడంలో అంతర్యం ఏమిటని చైనా ప్రశ్నిస్తోంది. 

ఫిలిప్పైన్స్ లోని వెర్డె ఐలాండ్ జలమార్గం ద్వారా ఈ అమెరికా యుద్ధనౌక శనివారం నాడు దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించిందని చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. 

ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో అమెరికా కార్యకలాపాలు పెరిగాయి. దాంతో చైనా గుర్రుగా ఉంటోంది. ఇవి అంతర్జాతీయ సముద్ర జలాలు అని అమెరికా అంటుండగా, ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టంలో అంతర్జాతీయ జలాలు వంటివేవీ లేవని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ వ్యాఖ్యానించారు. తైవాన్ జలసంధిపై సర్వహక్కులు, సార్వభౌమాధికారం చైనా సొంతమని స్పష్టం చేశారు. తైవాన్ జలసంధి చైనా న్యాయపరిధిలోకే వస్తుందని ప్రకటన చేశారు. తద్వారా తైవాన్ తమదేనంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

More Telugu News