Madhya Pradesh: తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడిన మధ్యప్రదేశ్ జట్టు... ఫైనల్లో ముంబయి జట్టుపై గ్రాండ్ విక్టరీ

  • 2021-22 సీజన్ రంజీ చాంపియన్ గా మధ్యప్రదేశ్
  • ఫైనల్లో ముంబయిపై 6 వికెట్ల తేడాతో విజయం
  • మధ్యప్రదేశ్ జట్టుపై ప్రశంసల జడివాన
  • చంద్రకాంత్ పండిట్ శిక్షణలో రాటుదేలిన మధ్యప్రదేశ్ ఆటగాళ్లు
Madhya Pradesh wins first ever Ranji Trophy by beating Mumbai in one sided final

ఎలాంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది రంజీ సీజన్ లో బరిలో దిగిన మధ్యప్రదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి రంజీ ట్రోఫీ విజేతగా అవతరించింది. ముంబయి వంటి దిగ్గజ జట్టుతో ఏకపక్షంగా సాగిన ఫైనల్లో మధ్యప్రదేశ్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ముంబయి జట్టు 269 పరుగులు చేయగా, మధ్యప్రదేశ్ ముందు 108 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. 4 వికెట్ల నష్టానికి మధ్యప్రదేశ్ ఈ లక్ష్యాన్ని అధిగమించి రంజీ టైటిల్ ను ఒడిసిపట్టింది.

కాగా, ఈ విజయం వెనుక మధ్యప్రదేశ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ కృషి ఎంతో ఉంది. సాదాసీదా ఆటగాళ్లుగా ఉన్న రజత్ పాటిదార్, శుభమ్ శర్మ, యశ్ దూబే, హిమాంశు మంత్రి వంటివాళ్లని స్టార్లుగా తీర్చిదిద్దాడు. కోచ్ గా చంద్రకాంత్ పండిట్ కు ఇది దేశవాళీ క్రికెట్లో ఆరో టైటిల్ కావడం విశేషం. 

కాగా, 41 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా, స్టార్ ప్లేయర్లతో కూడిన ముంబయి జట్టును ఓడించడం మూమూలు విషయమేమీ కాదు. అయితే, మధ్యప్రదేశ్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంపొందించడంపైనే దృష్టి సారించిన కోచ్ చంద్రకాంత్ పండిట్ అద్భుత ఫలితాలు రాబట్టాడు. వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్ వంటి ప్రతిభావంతులు లేకపోయినా మధ్యప్రదేశ్ జట్టు బలమైన ముంబయి జట్టును ఓడించింది. తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్ జట్టుపై అభినందనల వర్షం కురుస్తోంది.

More Telugu News