VS SRSAM: భారత రక్షణ రంగంలో మరో విజయం.... సత్తా చాటిన వీఎల్ ఎస్ఆర్ సామ్ క్షిపణి

  • ఒడిశాలోని చాందీపూర్ తీరం నుంచి ప్రయోగం
  • నిర్దేశిత ఫలితాలను అందించిన సామ్ మిస్సైల్
  • పరీక్ష వివరాలు వెల్లడించిన డీఆర్డీవో
VL SRSAM Missile successfully test fired

భారత రక్షణ రంగ పాటవం మరోసారి స్పష్టమైంది. ఉపరితలం నుంచి గగనతలానికి (సర్ఫేస్ టు ఎయిర్) ప్రయోగించే వీఎల్ ఎస్ఆర్ సామ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశా చాందీపూర్ తీరంలోని ఇండియన్ నేవల్ షిప్ (ఐఎన్ఎస్) నుంచి వెర్టికల్ (నిట్టనిలువు) పద్ధతిలో దీన్ని ప్రయోగించారు. ఈ పరీక్షను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), భారత నేవీ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ క్షిపణి పరీక్ష సంతృప్తికరంగా సాగిందని డీఆర్డీవో వెల్లడించింది. 

గగనతల ముప్పు నుంచి యుద్ధ నౌకలను కాపాడేందుకు ఈ వీఎల్ ఎస్ఆర్ సామ్ క్షిపణులను అభివృద్ధి చేశారు. దీన్ని ప్రధానంగా నావికాదళ ప్రయోజనాల కోసం  రూపొందించారు. సముద్ర, గగనతలం నుంచి దూసుకువచ్చే ఆయుధాలను ఇది నిర్వీర్యం చేయగలదు. 

ఇవాళ్టి ప్రయోగం ఓ హైస్పీడ్ వైమానిక లక్ష్యాన్ని ఛేదించేందుకు నిర్వహించగా, విజయవంతం అయిందని డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. కాగా, ఈ క్షిపణి పరీక్ష విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలను, భారత నేవీ వర్గాలను అభినందించారు.

More Telugu News