YSRCP: జ‌గ‌న్ పారిస్ ప‌ర్య‌ట‌న‌కు సీబీఐ కోర్టు అనుమ‌తి

  • కుమార్తె స్నాత‌కోత్స‌వానికి హాజ‌రు కావాల్సి ఉంద‌ని జ‌గ‌న్ అభ్య‌ర్థ‌న‌
  • పారిస్ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తించాల‌ని పిటిష‌న్‌
  • అనుమ‌తి ఇవ్వ‌వ‌ద్ద‌ని సీబీఐ అధికారుల వాద‌న‌
  • సీబీఐ వాద‌న‌ను తిర‌స్క‌రించిన కోర్టు
  • ఈ నెల 28 నుంచి 10 రోజుల పాటు పారిస్‌లో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు కోర్టు అనుమ‌తి
cbi special court permit ys jagan to go to paris

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బుధ‌వారం నాంప‌ల్లి సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. పారిస్‌లో చ‌దదువుతున్న త‌న కుమార్తె స్నాత‌కోత్స‌వానికి హాజ‌ర‌య్యేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ జ‌గ‌న్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ప‌ట్ల కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ మేర‌కు జ‌గ‌న్ పారిస్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమ‌తి మంజూరు చేసింది.

జ‌గ‌న్ ఇద్ద‌రు కుమార్తెలు విదేశాల్లో విద్య‌న‌భ్య‌సిస్తున్న సంగ‌తి తెలిసిందే. వారిలో పారిస్‌లో చ‌దువుతున్న కుమార్తె విద్యాభ్యాసం పూర్తి కాగా... క‌ళాశాల స్నాత‌కోత్స‌వానికి రావాలంటూ జ‌గ‌న్‌ను ఆయ‌న కుమార్తె ఆహ్వానించారు. అయితే ఆదాయానికి మించి ఆస్తులు కూడ‌బెట్టార‌న్న ఆరోప‌ణ‌ల‌పై న‌మోదైన కేసులు సీబీఐ కోర్టులో విచార‌ణ ద‌శ‌లో ఉండ‌గా...విదేశాల‌కు వెళ్లేందుకు కోర్టు అనుమ‌తి జ‌గ‌న్‌కు త‌ప్ప‌నిస‌రిగా మారింది.

ఈ క్ర‌మంలో త‌న కుమార్తె స్నాత‌కోత్స‌వానికి వెళ్లేందుకు త‌న‌కు అనుమ‌తి ఇవ్వాలంటూ ఇటీవ‌లే జ‌గ‌న్ సీబీఐ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పిటిష‌న్‌పై ఇప్ప‌టికే ఓ ద‌ఫా విచార‌ణ సాగ‌గా... జ‌గ‌న్‌ను విదేశీ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తించ‌రాద‌ని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. జ‌గ‌న్ విదేశాల‌కు వెళితే కేసుల విచార‌ణ‌లో జాప్యం జ‌రుగుతుంద‌ని సీబీఐ వాదించింది. 

తాజాగా బుధ‌వారం నాటి విచార‌ణ‌లో సీబీఐ వాద‌న‌ను తోసిపుచ్చిన కోర్టు జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తించింది. ఈ నెల 28 నుంచి 10 రోజుల పాటు పారిస్‌లో ప‌ర్య‌టించేందుకు జ‌గ‌న్‌కు కోర్టు అనుమ‌తి మంజూరు చేసింది. అయితే పారిస్ ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను సీబీఐ అధికారుల‌తో పాటు కోర్టుకు కూడా స‌మ‌ర్పించాల‌ని జ‌గ‌న్‌ను కోర్టు ఆదేశించింది.

More Telugu News