Andhra Pradesh: ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాల్లో బాలిక‌ల‌దే పైచేయి!...ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స!

  • ఫ‌స్టియ‌ర్‌లో 54 శాతం మంది పాస్‌
  • సెకండియ‌ర్‌లో పాస్ ప‌ర్సంటేజీ 65 శాతం
  • ఆగ‌స్టు 3 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు
  • ప‌రీక్ష‌లు ముగిసిన 28 రోజుల్లోనే ఫ‌లితాలు వెల్ల‌డించామ‌న్న బొత్స‌
apminister botsa satyanarayana releases intermediate results

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల చేశారు. ప‌రీక్ష‌లు ముగిసిన 28 రోజుల్లోనే ఫ‌లితాలు విడుద‌ల కావ‌డం గ‌మ‌నార్హం. మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్‌ పరీక్షలు నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. ఫ‌లితాల విడుద‌ల అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇంట‌ర్ ఫస్టియ‌ర్‌లో 4,45, 604 మంది, సెకండియ‌ర్‌లో 4,23455 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యార‌ని ఆయ‌న తెలిపారు. ఒకేషనల్‌ కోర్సుకు సంబంధించి 72, 299 మంది పరీక్షలు రాశార‌న్న ఆయ‌న‌... మొత్తంగా 9, 41, 350 మంది విద్యార్థులు ఇంట‌ర్ పరీక్షలకు హాజ‌ర‌య్యార‌ని చెప్పారు.

ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాల్లో 2,41,591 మంది ఉత్తీర్ణత సాధించారన్న బొత్స‌... పాస్ ప‌ర్సంటేజీ 54 శాతంగా న‌మోదైంద‌న్నారు. ఇందులో బాలురు 49 శాతం, బాలికలు 65 శాతం పాస్ అయ్యారని తెలిపారు. సెకండియ‌ర్‌లో 2,58,449 మంది పాస్ కాగా... 61 శాతం ఉత్తీర్ణత న‌మోదైంద‌ని ఆయ‌న చెప్పారు. ఇందులో బాలురు 55 శాతం, బాలికలు 68 శాతం పాస్‌ అయ్యారన్నారు.

రెండేళ్లలో బాలికలే ఎక్కువశాతం పాస్‌ అయ్యారని మంత్రి చెప్పారు. ఒకేషనల్‌లో మొదటి సంవత్సరం 45 శాతం, రెండో ఏడాది 55 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆయ‌న‌ వెల్లడించారు. అగ‌స్టు 3వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.

More Telugu News