Shiv Sena: అసోంకు మకాం మార్చిన ఏక్‌నాథ్ షిండే.. తనకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న సేన రెబల్ నేత

  • సూరత్ నుంచి గువాహటి చేరుకున్న షిండే
  • విమానాశ్రయంలో ఆహ్వానించిన బీజేపీ నేతలు
  • వారి కోసం సిద్ధం చేసిన హోటల్‌లో అసోం సీఎం
  • పార్టీ మారబోనని షిండే స్పష్టీకరణ
  • బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటూ ఉద్ధవ్ ఎదుట డిమాండ్
Sena Rebel Eknath Shinde Says 46 MLAs With Him

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి కారణమైన శివసేన ఎమ్మెల్యే, మంత్రి ఏక్‌నాథ్ షిండే తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి ఈ ఉదయం బీజేపీ పాలిత రాష్ట్రమైన అసోంలోని గువాహటి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్డీటీవీ (NDTV)తో ఆయన మాట్లాడుతూ.. తనకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. వారిలో 40 మంది సేన ఎమ్మెల్యేలు కాగా, ఆరుగురు స్వతంత్రులని పేర్కొన్నారు. పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించిన షిండే.. పార్టీ నుంచి తాను దూరంగా వెళ్లబోనని, బాలాసాహెబ్ థాకరే సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తానని అన్నారు. 

తాము హిందుత్వను విశ్వసిస్తామని, బాలాసాహెబ్ థాకరే శివసేన పార్టీకి తాను దూరం జరగబోనని షిండే స్పష్టం చేశారు. పార్టీని చీల్చే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు. గువాహటి విమానాశ్రయంలో షిండేకు బీజేపీ నేతలు పల్లబ్ లోచన్ దాస్, సుశాంత బోర్గోహెయిన్ షిండే స్వాగతం పలికారు. షిండే, ఇతర ఎమ్మెల్యేల కోసం సిద్ధం చేసిన పైవ్ స్టార్ హోటల్‌లో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కనిపించారు. 

తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో కలిసి గువాహటి చేరుకోవడానికి ముందు ఏక్‌నాథ్ షిండే గుజరాత్‌లోని సూరత్ హోటల్‌లో మకాం వేశారు. నిన్న సాయంత్రం పొద్దుపోయాక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. షిండేతో పది నిమిషాలపాటు టెలిఫోన్‌లో మాట్లాడారు. వెనక్కి రావాలని కోరారు. అయితే, కాంగ్రెస్-ఎన్సీపీతో పొత్తును విరమించుకుని బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని షిండే డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, సేన నేతల నుంచి ఎలాంటి ఇబ్బందులు, ప్రలోభాలు ఎదురుకాకూడదన్న ఉద్దేశంతోనే షిండే తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో కలిసి అసోంకు మకాం మార్చారు.

More Telugu News