Ajit Doval: అగ్నిప‌థ్‌పై వెన‌క‌డుగు లేదు!... జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ ప్ర‌క‌ట‌న‌!

  • అగ్నిప‌థ్ ప‌థ‌కంపై స్పందించిన అజిత్ దోవ‌ల్‌
  • రెగ్యుల‌ర్‌గా ఎంపిక‌య్యే అగ్నివీర్‌ల‌కు మ‌రోమారు శిక్ష‌ణ ఉంటుంద‌ని వెల్ల‌డి
  • యుద్ధాల్లో సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగం పెరిగింద‌న్న దోవ‌ల్‌
  • హింస‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌మ‌ర్థించ‌బోమ‌ని హెచ్చ‌రిక‌
nsa ajit doval responds on agnipath scheme and agitations over it

భార‌త సైన్యంలోకి భారీగా నియామ‌కాల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్ ప‌థ‌కంపై జాతీయ భద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ తాజాగా స్పందించారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో... అగ్నిప‌థ్ ప‌థ‌కం ల‌క్ష్యం, ఈ ప‌థ‌కంపై కొన‌సాగుతున్న ఆందోళ‌న‌లు, సైన్యంలో సంస్క‌ర‌ణ‌లు, యుద్ధ రీతుల్లో వ‌స్తున్న మార్పులు, పెరిగిపోయిన సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగం త‌దిత‌రాల‌పై ఆయ‌న కూలంక‌షంగా స్పందించారు.

అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని వెన‌క్కు తీసుకునే ప్ర‌స‌క్తే లేద‌ని అజిత్ దోవ‌ల్ ప్ర‌క‌టించారు. అగ్నిప‌థ్ ప‌థ‌కంతోనే భార‌త సైన్యం మొత్తం అగ్నివీర్‌ల‌తోనే నిండిపోద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. రెగ్యుల‌ర్ సైనికులుగా ఎంపికైన అగ్నివీర్‌ల‌కు మ‌రోమారు క‌ఠోర‌ శిక్ష‌ణ ఉంటుంద‌ని తెలిపారు. రెజిమెంట్ల‌లో ఎలాంటి మార్పులు ఉండ‌బోవ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. 

ప్ర‌స్తుతం దేశాల మ‌ధ్య యుద్ధాల స్వ‌రూప‌మే మారిపోయింద‌ని దోవ‌ల్ చెప్పారు. యుద్ధాల్లో సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగం గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ నేప‌థ్యంలో కంటికి క‌నిపించని శ‌త్రువుతో టెక్నాల‌జీ సాయంతో పోరాటం చేయాల్సి ఉంద‌ని తెలిపారు. ఈ మార్పుల‌కు అనుగుణంగా సిద్ధ‌మ‌వ‌డం త‌ప్పించి వేరే మార్గం లేద‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. దేశ భ‌ద్ర‌త‌కు సంబంధించిన అంశాలు స్థిరంగా ఉండ‌వ‌ని, చాలా వేగంగానే మారిపోతుంటాయ‌ని కూడా దోవ‌ల్ తెలిపారు.

భార‌త్‌ను కాపాడాల‌ని త‌ప‌న‌ప‌డే యువ‌త ప్ర‌తిభ‌ను త‌ప్ప‌నిస‌రిగా వాడుకుంటామ‌ని దోవ‌ల్ స్ప‌ష్టం చేశారు. అగ్నిప‌థ్‌లో చేరేందుకు యువ‌త సిద్ధ‌ప‌డాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. స‌మాజంలో ఘ‌ర్ష‌ణ వాతావర‌ణాన్ని సృష్టించేందుకు కొంద‌రు అగ్నిప‌థ్‌ను వ్య‌తిరేకిస్తున్నార‌ని ఆరోపించారు. అయితే హింస‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌మ‌ర్థించ‌బోమ‌ని దోవ‌ల్ హెచ్చ‌రించారు.

More Telugu News