Tesla: టెస్లా కార్లను చూసి భయపడుతున్న చైనా.. రెండు నెలల పాటు ఆంక్షలు

  • కమ్యూనిస్ట్ పార్టీ వార్షిక సమావేశం ప్రాంతానికి రాకుండా నిషేధం
  • టెస్లా కార్ల యజమానుల నుంచి అంగీకార పత్రాల స్వీకరణ
  • స్పై కెమెరాలతో భద్రతా రిస్క్ ఉందని భావిస్తున్న సర్కారు
Tesla is security concern for China before crucial 20th Party Congress

చైనా టెస్లా కార్లను చూసి భయపడుతోంది. లేదంటే అధికార పార్టీ సమావేశానికి సమీపంలోకి టెస్లా కార్లు రాకుండా ఆంక్షలు విధించడం ఎందుకు? అసలు విషయం ఏమిటంటే.. చైనా తీర ప్రాంత జిల్లా అయిన బీడహేలో కమ్యూనిస్ట్ పార్టీ వార్షిక వేసవి సదస్సు జరగనుంది. విధానపరమైన కీలక నిర్ణయాలపై ఇక్కడ చర్చ జరుగుతుంటుంది. 

జులై 1 నుంచి రెండు నెలల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. అధ్యక్షుడు జిన్ పింగ్ సహా కమ్యూనిస్ట్ పార్టీ పూర్వపు నాయకులు కూడా హాజరు కానున్నారు. సాధారణంగా ఇది గోప్యంగా జరుగుతుంది. మీడియాను కూడా అనుమతించరు. ఈ క్రమంలో టెస్లా కార్లను ఆ ప్రాంతంలోకి రాకుండా నిషేధించడమే ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

‘‘జులై 1 నుంచి ఆగస్ట్ 31 వరకు కారును, నంబర్ ప్లేటు సహా బీడహే జిల్లాలోకి ప్రవేశించను. లేదా బీడహే జిల్లా పరిధిలో నడుపుకుంటూ వెళ్లను’’ అని రాసి ఉన్న అంగీకారాన్ని టెస్లా కార్ల యజమానుల నుంచి అక్కడి అధికారులు తీసుకుంటున్నారు. అధ్యక్షుడు జిన్ పింగ్ ఈ నెల మొదట్లో చెంగ్డు పట్టణంలో ఉన్నప్పుడు కూడా టెస్లా కార్లు అక్కడికి రాకుండా నిషేధించడం గమనార్హం. 

టెస్లా కార్లపై చైనా ఆంక్షలు పెట్టడం వెనుక.. టెస్లా కార్లలో స్పై కెమెరాలు ఉంటాయన్న సందేహాల వల్లే. మోడల్ 3లో ఎనిమిది కెమెరాలు, 12 అల్ట్రా సోనిక్ సెన్సార్లు ఉండడంతో భద్రతా ముప్పు తలెత్తుతుందని చైనా సర్కారు భావిస్తోంది. కారు నడపడంలో, పార్కింగ్, ఇతర అవసరాల కోసం.. టెస్లా ఎన్నో కెమెరాలు, సెన్సార్లను అమరుస్తుంటుంది. ఇదే చైనా అభ్యంతరానికి కారణమవుతోంది.

More Telugu News