Nellore District: రేపు సాయంత్రానికి ఆత్మ‌కూరు ఉప ఎన్నిక ప్ర‌చారానికి తెర‌... 23న పోలింగ్‌

  • ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌కు ఏర్పాట్ల పూర్తి
  • పోలింగ్ ఏర్పాట్ల‌పై రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి మీనా ప్ర‌క‌ట‌న‌
  • మొత్తం 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డి
  • ఓట‌ర్లు నిర్భ‌యంగా ఓటేయాల‌ని పిలుపునిచ్చిన మీనా
atmakur bypoll campaign concludes tomoroow evening

ఏపీ దివంగ‌త మంత్రి మేకపాటి గౌత‌మ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం నేప‌థ్యంలో నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీ స్థానానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక ప్ర‌చారం మంగ‌ళ‌వారం సాయంత్రానికి ముగియ‌నుంది. ఈ నెల 23న ఉప ఎన్నిక పోలింగ్ జ‌ర‌గ‌నుంది. పోలింగ్‌కు ఓ రోజు ముందుగానే ప్ర‌చారం ముగియాల్సి ఉన్న నేప‌థ్యంలో ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా సోమ‌వారం సాయంత్రం ఉప ఎన్నిక‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించి ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మీనా పేర్కొన్నారు. ఎన్నిక‌ల నియమావ‌ళి ప్ర‌కారం మంగ‌ళవారం సాయంత్రానికే ప్ర‌చారాన్ని ముగించాల‌ని ఆయ‌న అన్ని రాజ‌కీయ పార్టీల‌కు సూచించారు. ఈ నిబంధ‌న‌ను అతిక్ర‌మించే పార్టీల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 279 పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. 

123 పోలింగ్ కేంద్రాల‌ను స‌మ‌స్యాత్మ‌క‌మైన‌విగా గుర్తించామ‌న్న మీనా... ఎన్నిక‌ల‌కు మూడంచెల భ‌ద్ర‌త క‌ల్పించామ‌ని తెలిపారు. పోలింగ్‌ను వెబ్ క్యాస్టింగ్ ద్వారా ప‌ర్య‌వేక్షిస్తామ‌ని, ఓట‌ర్లు నిర్భ‌యంగా ఓటేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అక్ర‌మాల‌పై సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని ఆయ‌న సూచించారు.

More Telugu News