BJP: వాలంటీర్ల ద్వారా ఓట‌ర్ల‌కు వైసీపీ డ‌బ్బు పంచుతోంది: ఈసీకి బీజేపీ ఫిర్యాదు

  • ఈ నెల 24న ఆత్మ‌కూరులో ఉప ఎన్నిక పోలింగ్‌
  • వైసీపీపై రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారికి సోము వీర్రాజు ఫిర్యాదు
  • బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌తో పాటు ఏజెంట్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని విన‌తి
bjp ap chief somu verraju complaint to election commission on ysrcp

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ముఖేశ్ కుమార్ మీనాకు బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు సోమ‌వారం ఓ ఫిర్యాదు చేశారు. ఎన్నిక‌ల పోలింగ్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో నియోజ‌కవ‌ర్గంలోని ఓట‌ర్ల‌ను అధికార వైసీపీ ప్ర‌లోభాల‌కు గురి చేస్తోంద‌ని ఆయ‌న ఫిర్యాదు చేశారు. గ్రామ‌, వార్డు వాలంటీర్ల ద్వారా ఓట‌ర్ల‌కు వైసీపీ డ‌బ్బు పంచుతోంద‌ని ఆయ‌న ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఈ క్ర‌మంలో ఓట‌ర్ల‌కు డ‌బ్బు పంచుతున్న వాలంటీర్ల‌ను గుర్తించి అడ్డ‌గించినందుకు బీజేపీ శ్రేణుల‌పై వైసీపీ నేత‌లు దాడులకు దిగుతున్నార‌ని వీర్రాజు త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా సాగాలంటే... బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌తో పాటు బీజేపీ ఏజెంట్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిని కోరారు. ఈ నెల 23న ఆత్మ‌కూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగతి తెలిసిందే.

More Telugu News