Vellampalli Srinivasa Rao: అవినీతిని ప్రశ్నించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌.. ‘నోర్ముయ్’ అంటూ ఎమ్మెల్యే వెల్లంపల్లి ఆగ్రహం.. స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు

  • తమాషా చేస్తున్నావా?.. పిచ్చిపిచ్చిగా ఉందా? అంటూ ఆగ్రహం
  • ఆరోపణలు నిరూపించకుంటే అరెస్ట్ చేయాలంటూ సీఐకి ఆదేశం
  • స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు
  • విడిపించి తీసుకొచ్చిన జనసేన నేత పోతిన
Software engineer who questions mla vellampalli taken to police station

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నిన్న విజయవాడలోని 50వ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి ఆయనకు ఊహించని ప్రశ్న ఎదురైంది. కార్యక్రమంలో భాగంగా మేయరు రాయన భాగ్యలక్ష్మి, ఇతర నాయకులతో కలిసి పర్యటించిన వెల్లంపల్లి వీఎల్‌వీ నాగబాబు అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంటికి వెళ్లారు. ఆయన అమ్మమ్మతోపాటు మరో ఇద్దరు వృద్ధులను పలకరించారు. 

ఈ సందర్భంగా నాగబాబు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ.. మీరు రూ.1500 కోట్ల అవినీతికి పాల్పడినట్టు టీడీపీ వారు ట్వీట్ చేశారని, మీరెందుకు ఆ విషయంపై మాట్లాడడం లేదని ప్రశ్నించాడు. కోట్ల రూపాయల అవినీతికి పాల్పడడం తప్పు కదా అని నిలదీశాడు. ఆ ప్రశ్న విన్న వెంటనే వెల్లంపల్లి ఆగ్రహంతో ఊగిపోయారు. అవన్నీ నీకెందుకంటూ ప్రశ్నించారు. నీకేం కావాలో చెప్పాలని నిలదీశారు. ఆ ఆరోపణలను ప్రెస్‌మీట్ పెట్టి ఎప్పుడో ఖండించానని చెప్పారు. ‘‘పిచ్చి పిచ్చిగా ఉందా? తమాషా చేస్తున్నావా? వెళ్లవోయ్.. నోర్ముయ్’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు, అక్కడే ఉన్న సీఐ సుబ్రహ్మణ్యాన్ని పిలిచి ఆరోపణలు నిరూపించకుంటే నాగబాబును అరెస్ట్ చేయాలంటూ హుకుం జారీ చేశారు.

అయితే, తన వద్ద రుజువులు ఉన్నాయని, చూపిస్తానని చెప్పి ఫోన్ తీసుకొచ్చేందుకు వెళ్లగా.. ‘‘ఇక్కడ కాదు, అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించండి.. నిరూపించకుంటే అరెస్ట్ చేయండి’’ అని ఆదేశించి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ఆ తర్వాత నాగబాబును పోలీసులు కొత్తపేట స్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలిసిన జనసేన  విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నాగబాబును పరామర్శించారు. ఆపై ఉన్నతాధికారులతో మాట్లాడి విడిపించి బయటకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నించే వారి గొంతును నొక్కెయ్యాలని చూస్తే జనసేన ఊరుకోదన్నారు.

More Telugu News