England: క్రికెట్‌లో ఇలాంటి క్యాచ్‌ను మీ జీవితంలో చూసి ఉండరు.. కావాలంటే వీడియో చూడండి

  • ఇంగ్లండ్‌లో రెండు క్లబ్‌ల మధ్య మ్యాచ్‌లో ఘటన
  • క్యాచ్‌ను అందుకోబోయి పట్టు తప్పి కిందపడిన బౌలర్
  • అతడి కాలుకు తాకి మళ్లీ పైకి లేచిన బంతి
  • గబుక్కున లేచి పట్టుకున్న బౌలర్
greatest dropped catch ever in cricket history

క్రికెట్‌లో మీరు ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు చూసి ఉంటారు. కానీ, క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి క్యాచ్ పట్టగా మీరు చూసి ఉండరు. చేతుల్లోంచి మిస్సయి కిందపడిన బంతి కాలుకి తగిలి పైకి లేస్తే.. క్షణాల్లోనే స్పందించిన ఫీల్డర్ దానిని ఒడిసి పట్టుకుని బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఏం జరిగిందో అర్ధం కాని బ్యాటర్ విస్తుపోయి పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్‌లోని అల్‌డ్విక్ క్రికెట్ క్లబ్, లింగ్‌ఫీల్డ్ క్రికెట్ క్లబ్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుత క్యాచ్ ఆవిష్కృతమైంది.

అల్‌డ్విక్ బౌలర్ అలెక్స్ రైడర్ విసిరిన బంతిని లింగ్‌ఫీల్డ్ బ్యాటర్ బలంగా బాదాడు. అయితే, అది గురితప్పి పిచ్‌పైనే గాల్లోకి లేచింది. అది తనవైపే రావడంతో అలెక్స్ దానిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో వెనక్కి పడిపోవడంతో చేతుల్లోకి వచ్చిన బంతి కిందికి జారింది. అప్పుడే అద్భుతం జరిగింది. 

కిందపడిపోయిన బౌలర్ కాలు గాల్లోకి లేవడంతో ఆ కాలికి తగిలిన బంతి మళ్లీ పైకి లేచింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అలెక్స్ గబుక్కున లేచి బంతిని తన చేతుల్లో బంధించాడు. ఊహించని ఈ పరిణామంతో విస్తుపోయిన బ్యాటర్ నిరాశగా వెనుదిరిగాడు. ఊహించని ఈ క్యాచ్‌తో మైదానంలో నవ్వులు విరిశాయి. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.. అద్భుతమైన ఈ వీడియోను మీరూ చూసేయండి.

More Telugu News