Rahul Gandhi: మా అమ్మ ఆసుపత్రిలో ఉంది... నా విచారణ సోమవారానికి వాయిదా వేయండి: ఈడీని కోరిన రాహుల్ గాంధీ

  • మనీలాండరింగ్ కేసులో రాహుల్ గాంధీ
  • గత మూడ్రోజులుగా విచారణ జరుపుతున్న ఈడీ
  • నేడు బ్రేక్ ఇచ్చిన ఈడీ
  • ఆసుపత్రిలో తల్లిని పరామర్శించిన రాహుల్
Rahul Gandhi asks ED to postpone questioning for Monday

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గత మూడ్రోజులుగా ప్రశ్నించారు. మొత్తం 28 గంటల పాటు విచారణ జరిపారు. తాజాగా, శుక్రవారం కూడా విచారణకు హాజరుకావాలంటూ రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే, విచారణను సోమవారానికి వాయిదా వేయాలని రాహుల్ గాంధీ ఈడీని కోరారు. ఈ మేరకు ఈడీకి లేఖ రాశారు. తన తల్లి సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమె ఆసుపత్రిలో ఉందని లేఖలో వివరించారు. 

కాగా, ఇవాళ విచారణ నుంచి రాహుల్ గాంధీకి ఈడీ అధికారులు విరామం ఇచ్చారు. ఆసుపత్రిలో ఉన్న తల్లి వద్దకు వెళ్లాలన్న రాహుల్ విజ్ఞప్తితో నేటి విచారణ నిలిపివేశారు. దాంతో రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి తల్లి సోనియా చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. ఇక, రేపటి విచారణను సోమవారానికి వాయిదా వేయాలన్న రాహుల్ తాజా విజ్ఞప్తికి ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

తమ అగ్రనేత రాహుల్ గాంధీని మనీలాండరింగ్ కేసులో ఈడీ ప్రశ్నిస్తుండడం పట్ల కాంగ్రెస్ వర్గాలు భగ్గుమంటున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నాయి.

More Telugu News