Protests: కేంద్రం ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా బీహార్ లో హింసాత్మక ఘటనలు

  • కొత్త పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం
  • బబువా రోడ్డు రైల్వే స్టేషన్ లో రైలుకు నిప్పు
  • పోలీసులపైకి రాళ్లు రువ్విన నిరసనకారులు
Violent Protests In Bihar Over Centre Agnipath Scheme Tear Gas Fired

సాయుధ దళాల్లో (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) నాలుగేళ్ల స్వల్ప కాల వ్యవధి పాటు సేవలు అందించే ‘అగ్నిపథ్’ పథకాన్ని వ్యతిరేకిస్తూ బీహార్ లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. ఆర్మీలో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న యువత కేంద్రం నిర్ణయంతో నిరాశకు గురైంది. బీహార్ వ్యాప్తంగా వారు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో రైళ్లు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారు.

బబువా రోడ్డు రైల్వే స్టేషన్ వద్ద ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ అద్దాలు పగులగొట్టారు. ఒక కోచ్ కు నిప్పంటించారు. ‘భారతీయ ఆర్మీ ప్రేమికులు’ పేరుతో ఆందోళనకారులు బ్యానర్ పట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు.  

అర్రా పోలీసు స్టేషన్ లో అల్లరి మూకలపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. జెహానాబాద్ లో నిరసనకారులు రైళ్ల రాకపోకలను అడ్డుకునేందుకు పట్టాలపై కూర్చున్నారు. వీరిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. కేంద్ర ప్రభుత్వం తన కొత్త పథకాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాంత్ తో నవాడాలో యవకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 

అగ్నిపథ్ అన్నది స్వల్ప కాల ఉపాధి కార్యక్రమం. 10, ఇంటర్ అర్హతలపై ప్రతిభ ఆధారంగా ఎంపిక కావచ్చు. నాలుగేళ్ల సర్వీసు తర్వాత రెగ్యులర్ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి 25 శాతం కోటా ఉంటుంది. ఆర్మీలో రెగ్యులర్ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు కేంద్రం పథకంతో అసంతృప్తికి లోనైనట్టు తెలుస్తోంది.

More Telugu News